ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 29, 2021, 4:37 AM IST

ETV Bharat / city

PENSION ISSUES: మలిపొద్దులో మరో యుద్ధం!

ఆ ఆరుగురు వృద్ధులు ఎవరూ లేని అనాథలు. ఒక్కొక్కరిది ఒక్కో ఊరు. కడప జిల్లా కాశినాయన మండలం ఓబులాపురం గ్రామంలోని వివేకానంద ఆశ్రమంలో ఉంటున్నారు. ఆశ్రమంనుంచి వారి స్వగ్రామాలు 10 కి.మీ. నుంచి 100 కి.మీ.వరకు ఉన్నాయి. వీరంతా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, ఒంటరి పింఛన్లు పొందుతున్నారు. ఆగస్టు వరకు పోర్టబులిటీ విధానంలో పింఛను తీసుకున్నారు. సెప్టెంబరునుంచి ఈ విధానం తీసేయడంతో వీరికి కష్టాలు మొదలయ్యాయి. సొంతూరులోనే పింఛను తీసుకోవాలని అధికారులు చెప్పడంతో ఆశ్రమ నిర్వాహకుడే వాహనంలో తీసుకెళ్లి వారికి ఈ నెల పింఛను ఇప్పించారు. ఇంతరీ ఆ కథేంటంటే...

PENSION ISSUES
PENSION ISSUES

వైఎస్సార్‌ పింఛను కానుక అమలులో గత నెల వరకున్న పోర్టబులిటీ.. 2,3 నెలలకు కలిపి పింఛను తీసుకునే వెసులుబాట్లను ప్రభుత్వం తీసేయడం ఆశ్రమాల్లోని కొందరు వృద్ధులను ముప్పుతిప్పలు పెడుతోంది. అయినవారు కాదన్న దీనస్థితిలో ఆశ్రమాల్లో తలదాచుకుంటున్న వారు పింఛను పొందేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇన్నాళ్లు మందుబిళ్లలకు, చేతి ఖర్చులకు ఆసరాగా నిలిచిన పింఛను ఇప్పుడు అందుతుందో లేదోనన్న ఆందోళన వృద్ధుల్లో నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 100కుపైగా వృద్ధాశ్రమాలున్నాయి. వీరికి ప్రభుత్వం నెలనెలా ఇచ్చే పింఛనే కొండంత అండగా నిలుస్తోంది. గత నెలవరకు స్వగ్రామం చిరునామాతో ఆధార్‌ కార్డు, ఇతర ఆధారాలున్నా.. ఆశ్రమమున్న ఊరిలోనే పోర్టబులిటీ విధానంలో వారు పింఛను తీసుకుంటున్నారు. సెప్టెంబరునుంచి పోర్టబులిటీని ప్రభుత్వం రద్దు చేసింది. పైగా ఏనెల పింఛను ఆ నెలే తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. ఒక నెల పింఛను తీసుకోకపోతే మరుసటి నెలలో ఆ మొత్తాన్ని ఇవ్వబోమని వెల్లడించింది. దీంతో మంచానికి పరిమితమైనవారు, నడవలేని స్థితిలో ఉన్న వారు ఆయా గ్రామాలకు వెళ్లి పింఛను తీసుకునేందుకు ఈ నెల అవస్థలు పడ్డారు. కొంతమందిని వారి సంరక్షకులు వెంట తీసుకెళ్లారు. ఎవరూలేని వారిని ఆశ్రమ నిర్వాహకులే వాహనాల్లో తీసుకెళ్లి పింఛను మొత్తాన్ని ఇప్పించారు.

మ్యాపింగ్‌ చేయించండి

వాస్తవానికి లబ్ధిదారుల వివరాలను వాలంటీరు వద్ద మ్యాపింగ్‌ చేయిస్తే ఎక్కడైనా పింఛను తీసుకోవచ్చు. కానీ పోర్టబులిటీ అవకాశంతో చాలామంది మ్యాపింగ్‌ చేయించుకోకుండానే ఈ విధానంలో పింఛను పొందుతున్నారు. పోర్టబులిటీ రద్దుతో తప్పనిసరిగా స్వగ్రామాలకు వెళ్లాల్సి వస్తుంది. అక్టోబరు నెలైనా పింఛనును ఆశ్రమ గ్రామంలోనే తీసుకునేందుకు మ్యాపింగ్‌ చేయించాలని వాలంటీర్లను నిర్వాహకులు కోరితే.. ఆ అవకాశం లేదని కొన్నిచోట్ల చెబుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో మ్యాపింగ్‌ చేయించారు. పింఛను బదిలీ అవుతుందో లేదో చెప్పలేమని వారు స్పష్టం చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తే...

రాష్ట్రంలో వృద్ధాశ్రమాల్లో ఎంతమంది పోర్టబులిటీ ద్వారా తీసుకుంటున్నారో అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తే లెక్కతేలుతుంది. ఆశ్రమాల వద్దకే వాలంటీర్లను పంపి మ్యాపింగ్‌ చేయిస్తే 2 రోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది. ఇప్పటికే పలు చోట్ల సమస్యను నిర్వాహకులు ‘స్పందన’ ద్వారా కలెక్టర్లకు నివేదించారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో అక్టోబరు పింఛను పొందేందుకు వృద్ధులు మళ్లీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి.

రమణమ్మ, రాజామణి.. విజయనగరంలోని ప్రేమసమాజ వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. రమణమ్మ స్వగ్రామం బొబ్బిలి కాగా, రాజామణి సొంతూరు గరివిడి. విజయనగరంనుంచి వీరి గ్రామాలు 50 కి.మీ.దూరంలో ఉన్నాయి. గత నెల వరకు 2,3 నెలలకోసారి వారి గ్రామాలకు వెళ్లి పింఛను తీసుకునేవారు. ఇప్పుడు ఆ వెసులుబాటు తీసేయడంతో కష్టాలు మొదలయ్యాయి.

ఇదీ చదవండి:

RAINS: తగ్గని వరద ఉద్ధృతి..గులాబ్‌ ధాటికి అన్నదాతకు కష్టాలు

ABOUT THE AUTHOR

...view details