ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 18, 2021, 9:35 AM IST

ETV Bharat / city

కూలీల వేతన బకాయిలు రూ.400 కోట్లు

రాష్ట్రంలో ఆగస్టు నుంచి ‘ఉపాధి’ చెల్లింపులు నిలిచిపోయాయి. నరేగా అమలుపై దేశ వ్యాప్తంగా ప్రతి ఆర్నెల్లకోసారి అధ్యయనం చేసే లిబ్‌టెక్‌ ఇండియా సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో రాష్ట్రంలో వేతన బకాయిల విషయాన్ని ప్రస్తావించింది.

pending narega payments
pending narega payments

రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరేగా) కింద పనులు చేసిన కూలీలకు చెల్లించాల్సిన వేతన బకాయిలు రూ.400 కోట్లకు చేరాయి. అత్యధిక జిల్లాల్లో ఆగస్టు నుంచి చెల్లింపులు ఆగిపోయాయి. ఉపాధి పనులే జీవనాధారమైన కుటుంబాలు సకాలంలో వేతనాలు అందక అవస్థలు పడుతున్నాయి. నరేగా అమలుపై దేశ వ్యాప్తంగా ప్రతి ఆర్నెల్లకోసారి అధ్యయనం చేసే లిబ్‌టెక్‌ ఇండియా సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో రాష్ట్రంలో వేతన బకాయిల విషయాన్ని ప్రస్తావించింది. నరేగాలో 2021-22 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.6,271.70 కోట్లు కేటాయించింది. ఇప్పటి వరకు రూ.4,571.20 కోట్లు విడుదల చేసింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.7,379.90 కోట్ల విలువైన పనులు చేయించింది. ఇందులో రూ.4,773.5 కోట్లు కూలీల వేతనాలు ఉండగా.. వీటిలో ఇప్పటికీ రూ.400 కోట్లు చెల్లించాల్సి ఉంది. వేతనాలే కాకుండా రూ.48.5 కోట్ల పరిపాలన వ్యయం, రూ.2,557.9 కోట్ల విలువైన మెటీరియల్‌ కాంపోనెంట్‌ వినియోగించింది. అంటే.. కేంద్రం విడుదల చేసిన నిధులు ఇప్పటికే ఖర్చు చేయగా.. చేసిన పనులకు ఇంకా రూ.2,808.90 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ మొత్తాన్ని నెగిటివ్‌ బ్యాలెన్స్‌గా లిబ్‌టెక్‌ సంస్థ పేర్కొంది. కేటాయింపులకు మించి పనులు చేపట్టినందున ఈ ఏడాది నవంబరు-మార్చి మధ్య ఉపాధి కల్పించాలంటే అదనంగా రూ.1,782.09 కోట్లు అవసరమవుతాయని సదరు సంస్థ పేర్కొంది. 2020-21తో పోల్చితే కేంద్రం ఈ సారి 39.5% నిధులు తక్కువ కేటాయించినట్లు ఆ సంస్థ పేర్కొంది.

కేంద్రం దృష్టికి కూలీల బకాయిలు

కూలీలకు ఆగస్టు నుంచి వేతనాల చెల్లింపులు చేయని విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు తెలిపారు. చాలా రాష్ట్రాల్లో ఈ పరిస్థితే ఉందని, కేంద్రం త్వరలో బకాయిలు విడుదల చేసే అవకాశాలున్నాయని అన్నారు.

ఇదీ చదవండి:MINISTER BOTSA : 'స్వాతంత్య్ర పోరాటానికి.. అమరావతి ఉద్యమానికి పోలికేంటి'

ABOUT THE AUTHOR

...view details