ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

''చేతిలో అధికారం ఉన్నప్పుడు.. ఉత్తర్వులెందుకు?''

పాత్రికేయులను బెదిరించడం కోసమే ఏపీ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసిందని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ జస్టిస్‌ చంద్రమౌళీకుమార్‌ అన్నారు. ఈ అంశంపై త్వరితగతిన విచారణ కమిటీ బహిరంగ విచారణ చేపడుతుందన్నారు.

మీడియాపై జీవో పై పీసీఐ ఛైర్మన్

By

Published : Nov 5, 2019, 8:11 AM IST

ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలు రాసిన విలేకర్లపై కేసులు పెట్టే అధికారం ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుందని, అలాంటప్పుడు ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఏముందని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ జస్టిస్‌ చంద్రమౌళీకుమార్‌ ప్రసాద్‌ ప్రశ్నించారు. ప్రత్యేకంగా ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం వెనుక పాత్రికేయులను బెదిరించడమే ప్రధానోద్దేశమై ఉండొచ్చని భావించాల్సి వస్తుందన్నారు.

‘"మేం ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశాం. సాధ్యమైనంత త్వరగా వారి నుంచి సమాధానం వస్తుందని ఆశిస్తున్నాం. తర్వాత ఈ అంశంపై విచారణ కమిటీ బహిరంగ విచారణ చేపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వివరణతోపాటు, పాత్రికేయ సంఘాల వాదనలూ వింటుంది. విచారణ కమిటీ సిఫార్సులు కౌన్సిల్‌ ముందుకెళ్తాయి. దానికి అనుగుణంగా మేం నిర్ణయం తీసుకుంటాం. గతంలో మహారాష్ట్ర, దిల్లీ ప్రభుత్వాలు ఇలాంటి ఉత్తర్వులు జారీ చేస్తే మేం సుమోటోగా తీసుకొని నోటీసులిచ్చాం. వాటిపై కౌన్సిల్‌ నిర్ణయం వెలువరించకముందే ఆ ప్రభుత్వాలు తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాయి"- ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ జస్టిస్‌ చంద్రమౌళీకుమార్‌


దేశంలో పత్రికా స్వేచ్ఛను రక్షించడానికి చట్టబద్ధంగా ఏర్పాటైన ప్రెస్‌కౌన్సిల్‌ ఉంది చంద్రమౌళీ అన్నారు.. ఏదైనా పత్రిక ఉద్దేశపూర్వకంగా తప్పు వార్తలు రాసిందని ఎవరైనా భావిస్తే ప్రెస్‌కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయొచ్చని.. వాటిని పరీక్షించి తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం చెల్లింపు వార్తలు, తప్పుడు వార్తలు పెద్దఎత్తున కనిపిస్తున్నాయని... వాటిపై దృష్టి సారించాలన్నారు. పాత్రికేయులందరికీ బ్రాండ్‌ వేసి, బెదిరించడం సరికాదని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ విలేకరి హత్య విషయంపై డీజీపీని నివేదిక అడిగాడినట్లు తెలిపారు. ఆ నివేదికనూ కమిటీ ముందు పెట్టి మెరిట్‌ ప్రాతిపదికన విచారిస్తామని జస్టిస్‌ చంద్రమౌళీకుమార్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు.

తీవ్ర అభ్యంతరకరం: ఐఎన్‌ఎస్‌

పాత్రికేయులపై కేసులు పెట్టడానికి, విచారణ చేయడానికి కార్యదర్శి స్థాయి అధికారులకు పూర్తి అధికారాలు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430ని ఇండియన్‌ న్యూస్‌ పేపర్‌ సొసైటీ (ఐఎన్‌ఎస్‌) ఖండించింది. తీవ్ర అభ్యంతరకరమైన ఈ ఉత్తర్వును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ‘‘పరువుకు భంగం కలిగించే తప్పుడు వార్తల విషయంలో వివరణ కోరే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని... అలాకాకుండా అధికార యంత్రాంగానికి అపరిమిత అధికారాలివ్వడం మీడియాపై దారుణమైన ప్రభావం చూపుతుందని ఐఎన్​ఎస్​ పేర్కొంది.

అనవసర జీవో: ఎ.సూర్యప్రకాశ్‌

పాత్రికేయులను కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 2430.. అనవసర ఉత్తర్వు అని ప్రసారభారతి ఛైర్మన్‌ ఎ.సూర్యప్రకాశ్‌ అన్నారు.

" ఎవరైనా పరువుకు భంగం కలిగించేలా వార్తలు రాస్తే చర్యలు తీసుకోవడానికి ఐపీసీ నిబంధనలున్నాయి. కోర్టుకు వెళ్లొచ్చు. ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా దగ్గర ఫిర్యాదు చేయొచ్చు. ఈ అధికారాలన్నీ ప్రభుత్వానికి ఉన్నప్పుడు ప్రత్యేకంగా కార్యదర్శులకు అధికారాలు ఇవ్వాల్సిన పనేంటి? ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులివ్వడం మంచి నిర్ణయం. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో చూడాలి’"- సూర్యప్రకాశ్‌ , ప్రసార భారతి ఛైర్మన్

ABOUT THE AUTHOR

...view details