ఉల్లి అందరినీ ముప్పుతిప్పలు పెడుతోంది. విపరీతంగా పెరగిన ధరలతో ఆహార ప్రియులకు రుచికరమైన భోజనాన్ని దూరమైంది. టిఫిన్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఉల్లి దోశ... ఇప్పుడు మార్కెట్లో అది కరవైంది. నో ఉల్లి దోశ అని బోర్డులు పెడుతున్నారు. హోటల్స్‌లో అయితే బిర్యానీ పక్కన ఉల్లి కావాలంటే.. అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఆహార ప్రియులను ఉల్లి భలే ఇబ్బంది పెడుతోంది. ఏ హోటల్స్‌కి వెళ్లినా...ఉల్లి దోశ, ఉల్లి పెసర, ఉల్లి మినప దోశలు దొరక్కపోవడంతో...నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇక నాన్ వెజ్ కూరలు రుచికరంగా చేయాలంటే ఉల్లి కచ్చితంగా వాడాల్సిందే. అధిక ధరలతో ఉల్లిపాయలు కొనలేక... వచ్చిన వినియోగదారులను వెనక్కి పంపలేక రెస్టారెంట్ యజమానులు తిప్పలు పడుతున్నారు. ఉల్లి లేక వ్యాపారం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
ప్రస్తుతం ఉల్లిపాయల ధర రూ. 120 నుంచి 180 వరకు పలుకుతోంది. గత నెల రోజులుగా ఇదే పరిస్థితి. దీంతో హోటళ్లు ,రెస్టారెంట్ల యజమానులు ఉల్లి వినియోగాన్ని తగ్గించక తప్పట్లేదు. అల్పాహారంలో అధికంగా ఉల్లిదోశెపైనే మక్కువ చూపుతారు. ఉల్లిపాయలను అంత ధర పెట్టి కొనలేక టిఫిన్ సెంటర్లలో ఉల్లిదోశ లేదని చెప్పేస్తున్నారు. పూరీ కూరలో ఉల్లిపాయలుంటే ఆ రుచి అమోఘం.