కంటైన్మెంట్ జోన్‌లు మినహా.... రాష్ట్రవ్యాప్తంగా మిగతా ప్రాంతాల్లోని ఉన్నత పాఠశాలలు, కళాశాలలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజున 9వ తరగతి వారు 39 శాతం మంది, పదో తరగతివారు 44 శాతం మంది మాత్రమే బళ్లకు వచ్చారు. మొత్తంమీద విద్యార్థుల హాజరు 42శాతం నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. ఇంటర్ రెండో ఏడాది తరగతులకు కేవలం 16.6 శాతం మందే హాజరయ్యారు. కర్నూలులో తొలిరోజున ఇంటర్ తరగతులు ప్రారంభం కాలేదు.
అన్ని చోట్లా కొవిడ్ నిబంధనల మేరకే తరగతులు నిర్వహించారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు నిర్ధరణ పరీక్షలు చేయించుకుని వాటి నివేదికలు పాఠశాలల్లో సమర్పించారు. తరగతుల ప్రారంభానికి ముందు అందరూ కొవిడ్ ప్రతిజ్ఞలు చేశారు. విద్యార్థులకు కరోనాపై అవగాహన తరగతులు నిర్వహించారు. గదులు, బెంచీల్లో పరిమిత సంఖ్యలోనే విద్యార్థులను కూర్చోబెట్టారు. ఉదయం పూట తరగతులు నిర్వహించగా.. మధ్యాహ్న భోజనం తర్వాత పిల్లలను ఇళ్లకు పంపించారు. చాలా కాలం తర్వాత బడులకు రావడం ఆనందంగా ఉందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లావ్యాప్తంగా విద్యార్థులు పూర్తిస్థాయిలో రాకపోయినా.. హాజరు సంతృప్తికరంగానే ఉందని అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం ఏపీ మోడల్ పాఠశాల కాపలాదారుకు, పాతవెల్లంటి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకినట్టు గుర్తించారు. ఆయా పాఠశాలలను శానిటైజేషన్ చేశామన్నారు. విజయవాడ సమీపంలోని నిడమానూరు పాఠశాలలో తరగతి గదుల కొరత వల్ల కొందరు విద్యార్థులు ఆరుబయటే కూర్చోవాల్సివచ్చింది. కర్నూలు జిల్లా నందికొట్కూరులోని బాలికల ఉన్నత పాఠశాలలో నాడు-నేడు పనులు పూర్తవకపోవడం వల్ల విద్యార్థులను బయటే కూర్చోబెట్టారు. వీటితో పాటు అనేక మౌలిక వసతుల లేమి వేధిస్తున్నట్టు విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలిపారు.