గ్రామాల్లో కొంతైనా అభివృద్ధి జరుగుతోందంటే కేంద్రం కేటాయిస్తున్న ఆర్థిక సంఘం, ఉపాధి హామీలో మెటీరియల్ నిధులతోనే! ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీల బకాయిల కింద మళ్లిస్తున్నందున పల్లెల్లో రెండేళ్లుగా చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు జరగడం లేదు. నరేగాలో మెటీరియల్ నిధులదీ అదే పరిస్థితి. వైకాపా ప్రభుత్వం వచ్చాక రూ.10 వేల కోట్ల మెటీరియల్ నిధులతో 36,500కి పైగా భవన నిర్మాణాలకు అనుమతులిచ్చారు. వీటిలో గ్రామ సచివాలయాలు, డిజిటల్ గ్రంథాలయాలు, రైతు భరోసా, ఆరోగ్య, పాలశీతలీకరణ కేంద్రాల భవనాలు ఉన్నాయి. కొత్తగా చేపట్టాల్సిన ఇతర పనులను పూర్తిగా వదిలేశారు. కేంద్రం నుంచి గతేడాది మెటీరియల్ నిధుల విడుదలలో జాప్యంతో భవన నిర్మాణాలకు బిల్లులు సకాలంలో చెల్లించలేకపోయారు. వివిధ దశల్లో ఉన్న వీటిని పూర్తిచేయడం అధికారులకు సవాలుగా మారింది. ప్రస్తుతానికి పెండింగ్ బిల్లులు చెల్లించి మిగిలిన పనులు డిసెంబరులోగా చేయించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో మెటీరియల్ నిధులతో కొత్త పనులు మంజూరు చేయడం లేదు. గతేడాది అరకొరగా కేటాయించినా, ఈసారి పూర్తిగా నిలిపివేశారు.
తప్పిన అంచనాలు