తమ వైపు ఒప్పంద ఉల్లంఘనలు జరగకపోయినా పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్ట్ పనులను నచ్చిన వారికి అప్పగించాలన్న దురుద్దేశంతో ఒప్పందాన్ని ఏపీ జెన్ కో రద్దు చేసిందని నవయుగ సంస్థ హైకోర్టులో వాదనలు వినిపించింది. రీటెండరింగ్ పై ముందుకెళ్లొద్దని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అధికారులు నిర్లక్ష్యం చేసి కోర్టు దిక్కారానికి పాల్పడ్డారని ఆ సంస్థ తరపున సీనియర్ న్యాయవాది విల్సన్ పేర్కొన్నారు.
దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు....
జీవో ప్రకారం రీటెండరింగ్ లో కనీసం 2 బిడ్ లు దాఖలు కావాల్సి ఉండగా...మేఘా సంస్థ ఒక్కటే దాఖలు చేసినా ఆ సంస్థకే పనులు అప్పగించబోతున్నారని తెలిపారు. నవయుగతో ఒప్పందం కుదుర్చుకున్న అధికారే ప్రస్తుతం వ్యాజ్యంలో కౌంటరు దాఖలు చేస్తూ నవయుగ సంస్థకు ప్రయోజనాలు చేకూర్చేలా అప్పట్లో నిబంధనలు తయారు చేశారని పేర్కొన్నటాన్ని న్యాయమూర్తి దృష్టికీ తీసుకెళ్లారు. దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారనటానికి ఈ కారణం చాలన్నారు. ఉత్తర్వులను ఎత్తివేయాలని జెన్ కో దాఖలు చేసిన పిటీషన్ ను కొట్టివేయాలని కోరారు.
నిబంధలను విస్మరించారు....
'ఒప్పంద నిబంధనలను జెన్ కో విస్మరించింది. విద్యుత్ ప్రాజెక్ట్ పనులను నిర్వహించాల్సిన ప్రాంతాన్ని మాకు అప్పగించటంలో విఫలమైంది. జల విద్యుత్ యూనిట్ల నిర్మాణాన్ని పూర్తిచేసి అప్పగించేందుకు మాకు 2023 వరక గడువుంది. పనుల్లో పురోగతి ఉందనే మైల్ స్టోన్ కింద 2 విడతల్లో సొమ్ము చెల్లించారు. ఒప్పందం వెనక ప్రభుత్వ పాత్ర ఉంది. అందువల్ల జెన్ కో వేసిన స్టే వెకెట్ పిటిషన్ ను కొట్టేయండి' అని నవయుగ తరపు న్యాయవాది విల్సన్ వాదించారు.
ఈ నెల 30కి వాయిదా...