రాష్ట్రంలో పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టులు నిర్మించడం, పర్యావరణానికి వాటిల్లే నష్టాలపై అధ్యయనం చేయకుండానే పనులు చేయడంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) కొరడా ఝుళిపించింది. పోలవరం (ఇందిరాసాగర్), మూడు ఎత్తిపోతల పథకాలకు కలిపి రూ.243.16 కోట్ల జరిమానా విధించింది. జరిమానాను రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల్లోపు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి (ఏపీ పీసీబీ) చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
పోలవరం నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని పెంటపాటి పుల్లారావు, పర్యావరణ అనుమతులు తీసుకోకుండా పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల నిర్మాణాలు చేపడుతున్నారని జమ్ముల చౌదరయ్య, మడిశర్ల సత్యనారాయణ, వట్టి వసంతకుమార్ తదితరులు వేర్వేరుగా 2017 నుంచి ఎన్జీటీలో పిటిషన్లు వేశారు. వీటిని ఉమ్మడిగా విచారించిన ఎన్జీటీ.. పిటిషన్లలోని వాస్తవాల నిర్ధారణకు నిపుణుల కమిటీలను నియమించింది. ఆ కమిటీలు అనుమతులు తీసుకోకపోవడం, పర్యావరణ ఉల్లంఘనలు నిజమేనని నిర్ధారించాయి. ఆయా నివేదికల ఆధారంగా ఎన్జీటీ ఛైర్మన్ జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయల్, సభ్యులు జస్టిస్ సుధీర్ అగర్వాల్, జస్టిస్ బ్రిజేష్ సేథి, విషయ నిపుణుడు నగిన్ నందాలతో కూడిన ధర్మాసనం ఈ అంశాలపై పలుమార్లు విచారణ జరిపింది. ధర్మాసనం గురువారం తుది విచారణ జరిపి 426 పేజీల తీర్పును వెలువరించింది. వివరాలు ఇలా ఉన్నాయి...
ప్రాజెక్టుల వారీగా జరిమానా