తెలంగాణలో నాగోబా జాతర ఈరోజు అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. నాగోబా జాతర పండుగతో మెస్రం వంశస్థుల జీవన విధానం ముడిపడి ఉంది. అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలకు ఈ జాతర తలమానికంగా నిలుస్తోంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉండే మెస్రం వంశీయులు... నాగోబా జాతరతో ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్‌లో కలవాలనేది ఆచారం.
ఆ మొక్కు తీర్చుకుంటేనే..కోడలిగా గుర్తింపు
ఎడ్లబళ్లపై వచ్చి చెట్టు నీడన సేదదీరుతారు. గోదావరి నదికి పదిహేను రోజులపాటు కాలినడకన వెళ్లి.. మట్టి కుండల్లో తెచ్చే గంగాజలంతో... అర్ధరాత్రి తుడుం మోతలు, సన్నాయి వాయిద్యాల మధ్య నాగోబా దేవతకు అభిషేకం చేయడంతో జాతర ప్రారంభమవుతుంది. నాగోబా సన్నిధిలో బేటి పేరిట మొక్కు తీర్చుకుంటేనే... పెళ్లైన మహిళలకు మెస్రం వంశీయుల కోడలిగా గుర్తింపు లభిస్తుంది. ఇక్కడ కర్మకాండ చేస్తేనే కాలం చేసినవారికి మోక్షం లభిస్తుంది.