ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Munugode Bypoll: రాజకీయ రణక్షేత్రం.. మునుగోడులో గెలుపెవరిది?

Munugode by election: దీపావళికి 10రోజుల ముందుగానే తెలంగాణలోని మునుగోడులో మతాబులు  పేలుతున్నాయి. నేతల మధ్య మాటలు.. మంటలు పుట్టిస్తున్నాయి. వాగ్బాణాలు.. వాల్‌పోస్టర్లుగా  మారిపోయాయి. పోలింగ్‌ గడువు దగ్గర పడుతున్న కొద్దీ.. రాజకీయం రణక్షేత్రాన్ని తలపిస్తోంది. పోటాపోటీగా  ప్రచారాలు.. ప్రత్యర్థులను చిత్తుచేసే ఎత్తులతో రాజకీయ పార్టీలు హోరెత్తిస్తున్నాయి. ఉపపోరులో సత్తాచాటడమే లక్ష్యంగా  ప్రధాన పార్టీల నాయకత్వం ఇప్పటికే ఊరూరా మొహరించగా.. అగ్రనేతల పర్యటనలకు  ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.

రాజకీయ రణక్షేత్రం.. మునుగోడులో గెలుపెవరిది?
రాజకీయ రణక్షేత్రం.. మునుగోడులో గెలుపెవరిది?

By

Published : Oct 12, 2022, 9:37 AM IST

రాజకీయ రణక్షేత్రం.. మునుగోడులో గెలుపెవరిది?

MunugodE by election: రాష్ట్రంలో కీలక ఉపఎన్నికకు వేదికగా మారిన మునుగోడులో రాజకీయం వేడెక్కుతోంది. కొన్ని రోజులుగా నేతల పరస్పర విమర్శలు, ప్రచారాలతో హోరెత్తగా.. తాజాగా, ఓ నేతను వ్యతిరేకిస్తూ పోస్టర్లు వెలియడం, మరో పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టడంతో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోమవారం నామినేషన్‌ వేయగా.. రాత్రి చండూరులో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనకు వ్యతిరేకంగా.. 18వేల కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడు పోయారని.., ఫోన్‌పే మాదిరిగా 'కాంట్రాక్ట్‌-పే' అని ఉన్న పోస్టర్లను అతికించారు. వీటిపై భాజపా శ్రేణులు అన్ని మండలాల్లోనూ తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.

కాంగ్రెస్​ పార్టీ కార్యాలయంలో నిప్పు.. మరోవైపు.. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చండూరులోని కాంగ్రెస్‌ పార్టీ మండల కార్యాలయంలోని జెండాలు, కండువాలు, ఇతర ప్రచార సామగ్రికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. చండూరులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పర్యటన ఉన్న వేళ ఈ ఘటన జరగటం వెనుక తెరాస, భాజపా శ్రేణులు ఉన్నట్లు కాంగ్రెస్‌ ఆరోపించింది. ఏడు మండలాల్లో పార్టీ శ్రేణులు ధర్నాలు చేశాయి. చండూరు చౌరస్తాలోని ప్రధాన రహదారిపై కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంపై దాడిని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి ఖండించారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఎస్పీ ప్రత్యేక బృందాన్ని నియమించారు.

రేవంత్​రెడ్డి ఆగ్రహం.. చండూరు ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు వస్తున్న ఆదరణను ఓర్వలేకే తెరాస, భాజపాలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారన్నారు. పార్టీ దిమ్మెలు కూల్చినా, కార్యాలయాలు తగులబెట్టినా మునుగోడు గడ్డపై తమ గెలుపును ఆపలేరన్నారు. చండూరు మండలం పల్లెంల, బంగారిగడ్డ, చామలపల్లి, కస్తాల గ్రామాల్లో పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతితో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. చర్లగూడెం భూనిర్వాసితులకు తెరాస ప్రభుత్వం న్యాయం చేయలేకపోయిందన్న రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలో ప్రజాసమస్యలు పరిష్కరించకుండా జాతీయ రాజకీయాల పేరుతో కేసీఆర్​ దేశం తిరుగుతున్నారని విమర్శించారు.

18 లక్షల భూమిని నిషేధిత జాబితాలో పెట్టిన తెరాస.. ఉపఎన్నికలో ప్రజలు తెరాసను ఓడించకుంటే కేసీఆర్‌ అహం తగ్గదని హుజురాబాద్ ఎమ్మెల్యే భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. మునుగోడులో పర్యటించిన ఆయన.. రాష్ట్ర సర్కార్‌ సుపరిపాలన అందించి ఉంటే.. ఒక్కో ఎంపీటీసీ స్థానానికి ఇన్‌ఛార్జిని పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నియంత్రణలో లేవని.. అడ్డగోలుగా కేసులు పెట్టి, భాజపా కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఆ పార్టీ మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని తెరాస సర్కార్‌.. 18లక్షల ఎకరాల ప్రైవేటు భూములను నిషేధిత జాబితాలో పెట్టి.. కాజేయాలని చూస్తోందని ప్రచారంలో భాగంగా ఆరోపణలు చేశారు. ఈ అవినీతిపై సీబీఐ విచారణ కోరుతామన్నారు.

వామపక్షాలు.. మతోన్మాద భాజపాను ఎదుర్కొనేందుకే తెరాసతో కలిసి వెళ్తున్నామని.. వామపక్ష పార్టీల నేతలు ప్రకటించారు. మునుగోడు నియోజకవర్గంలో సీపీఐ, సీపీఎం బలపరిచిన తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ.. చండూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు.

జగదీశ్​రెడ్డి వ్యాఖ్యలు.. కేటీఆర్​ సమర్థన.. ఓ కాంట్రాక్టర్ అహంకారంతోనే ఈ ఉపఎన్నిక వచ్చిందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ విమర్శించారు. మునుగోడు అభివృద్ధికి భాజపా అభ్యర్థి కేంద్రం నుంచి 18వేల కోట్ల నిధులు తీసుకువస్తే.. ఉపఎన్నికల బరి నుంచి వైదొలుగుతామని సవాల్‌ చేసిన మంత్రి జగదీశ్‌రెడ్డి.. దానికి ఈ నెల 13వరకు గడువు విధించారు. మునుగోడు మండలం ఇప్పర్తిలో ప్రచారంలో పాల్గొన్న ఆయన.. రాజగోపాల్‌రెడ్డి 13వ తేదీలోగా నిధులు తీసుకువస్తే, తెరాస అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ వేయరని వెల్లడించారు. జగదీశ్‌రెడ్డి చేసిన సవాల్‌ను తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ సమర్థించారు. హైదరాబాద్‌లో తెరాస విద్యార్థి విభాగం విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన.. 18వేల కోట్లు నిధులిస్తే పోటీ నుంచి తప్పుకుంటామని స్పష్టంచేశారు. ఫైనల్ పరీక్షలకు ముందు మునుగోడు యూనిట్ టెస్టులో సత్తా చూపాలని.. విద్యార్థి నేతలకు కేటీఆర్ సూచించారు.

మునుగోడు బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటూ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు.. ఉపఎన్నిక చెమటలు పట్టిస్తోంది. ఎదుటి పార్టీ నాయకులతో రాత్రి వేళ మంతనాలు జరుపుతూ.. తెల్లవారేసరికి పార్టీ కండువాలు కప్పుతున్నారు. ప్రతి బూత్‌లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయో అనే విషయాన్ని.. వచ్చే సాధారణ ఎన్నికల కోణంలోనే అన్ని పార్టీలు చూస్తుండటంతో.. తమ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది కాకుండా క్షేత్రస్థాయిలో నాయకులు, ఎమ్మెల్యేలు పోల్‌మేనేజ్‌మెంట్‌ చేస్తున్నారు. ఓ ప్రధాన పార్టీ అయితే ఈ ఎన్నికల్లో తమ పరిధిలో పార్టీకి వచ్చే ఓట్లను బట్టే.. రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అంతర్గతంగా వెల్లడించిందని తెలిసింది.

మునుగోడు ఉపఎన్నికలకు మూడోరోజైన మంగళవారం ఆరుగురు అభ్యర్థులు 9 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తంగా ఈ మూడు రోజుల్లో 17 మంది అభ్యర్థులు నామినేషన్‌ వేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఈనెల 14వ తేదీన భారీ జనసమీకరణతో నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఉపఎన్నిక బరిలో తమ అభ్యర్థిగా పల్లె వినయ్‌కుమార్‌ను బరిలోకి దించుతున్నట్లు తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ప్రకటించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details