ENERGY SWARAJ YATRA: సోలార్ బస్సులో విశ్రాంతి తీసుకుంటున్న ఈయన పేరు చైతన్య సింగ్ సోలంకి. ముంబయి ఐఐటీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సోలంకి.... సౌర విద్యుత్‌పై అనేక పరిశోధనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కర్బన ఇంధన వనరుల వినియోగం వల్ల పెరిగిపోతున్న కాలుష్యం.. దాని పర్యవసానంగా జరుగుతున్న వాతావరణ మార్పులు ఆయనను ఆందోళనకు గురిచేశాయి. కాలుష్యం కారణంగా రుతువులు గతి తప్పి.. విశ్వం భవితవ్యమే అంధకారం కాబోతోందని... దీని దుష్ఫలితాలు ముందు తరాలు అనుభవించబోతున్నాయని ఆయన అంటున్నారు.
"ఇప్పటికే వాతావరణ మార్పు ప్రభావాన్ని మనమంతా అనుభవిస్తున్నాం. ఈ విషయం చెప్పడానికి శాస్త్రవేత్తలు, పరిశోధనలు పెద్దగా అవసరం లేదు. ఈ మార్పునకు కారణం ఎవరంటే మనమే. పెట్రోల్, డీజిల్, థర్మల్ విద్యుత్, గ్యాస్ వంటి కర్బన ఇంధనాలను వాడటం ద్వారా మనమంతా కాలుష్యానికి కారణం అవుతున్నాం."- చైతన్య సింగ్ సోలంకి, ముంబయి ఐఐటీ ప్రొఫెసర్
పర్యావరణ విధ్వంసంపై ప్రజలను జాగృతం చేయడమే తన లక్ష్యంగా భావించారు సోలంకి. నూటికి నూరు శాతం సౌర శక్తిని వాడినప్పుడే ఈ దుష్పరిణామాలు అంతమవుతాయని భావిస్తున్న ఆయన... ఆ దిశగా జనంలో చైతన్యం నింపాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగానికి పదేళ్లపాటు సెలవు పెట్టి.. ఎనర్జీ స్వరాజ్ యాత్ర ప్రారంభించారు. ఓ బస్సులో దేశమంతా ప్రయాణిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
సోలంకి చేపట్టిన ఈ ఎనర్జీ స్వరాజ్ యాత్ర.. పదేళ్ల పాటు సాగనుంది. సౌరశక్తిపై ప్రజల్లో, విద్యార్థుల్లో అవగాహన కల్పించడం... ప్రతి ఇంట్లో సౌరశక్తిని ఉపయోగించేలా ప్రేరేపిచడం ఆయన యాత్ర లక్ష్యాలు. యాత్ర కోసం సోలంకి స్వయంగా ఓ సౌర బస్సును తయారు చేసుకున్నారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో సుదీర్ఘ యాత్రకు సంకల్పించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రయాణించి దారిపొడవునా ప్రజలకు, విద్యార్థులకు సౌరశక్తిపై అవగాహన కల్పించడం ఆయన దినచర్య. ఈ పదేళ్ల యాత్రలో ఎప్పుడు ఎక్కడకి చేరుకోవాలి.. ఎక్కడ బస చేయాలి అనే ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు. యాత్రకు అవసరమైన అన్ని వసతులు బస్సులోనే సమకూర్చుకున్నారు.