ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KATHI MAHESH: కత్తి మహేష్​ మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: మందకృష్ణ

కత్తి మహేష్ మృతి (kathi mahesh )పై అనేక అనుమానాలున్నాయని ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ (MRPS founder Manda Krishna Madiga) అన్నారు. ఈ అంశాలపై ఏపీ ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.

Manda Krishna Madiga
Manda Krishna Madiga

By

Published : Jul 12, 2021, 5:36 PM IST

చిత్తూరు జిల్లా యర్రావారిపాళ్యం మండలం యలమందలో సినీ విమర్శకుడు, దర్శకుడు కత్తి మహేష్ (kathi mahesh ) అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన మృతదేహానికి ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (MRPS founder Manda Krishna Madiga) నివాళులర్పించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. కత్తి మహేష్ మరణం ఆవేదనను మిగిల్చిందన్నారు. మృతితో పాటు ప్రమాదం జరిగిన తీరుపై అనుమానాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు.

వీటన్నింటిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీఎం జగన్​ను కోరుతామని చెప్పారు. ప్రమాద సమయంలో డ్రైవర్​కు చిన్న గాయం కూడా కాకుండా.. కేవలం కత్తి మహేష్​కు తీవ్ర గాయాలు కావటం అనేక అనుమానాలను రేకెత్తిస్తోందన్నారు. చెన్నై వైద్యులు ప్రాణహాని లేదనీ.. రెండు మూడు రోజుల్లోనే డిశ్చార్జ్ చేస్తామని చెప్పిన ఐదు నిమిషాల్లోనే కత్తి మహేష్ చనిపోయాడని పేర్కొన్నారు. కత్తి మహేష్ మృతికి సంబంధించిన మిస్టరీని బయటపెట్టాలని.. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేష్.. జూలై 10వ తేదీన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తల, శరీరంపై తీవ్ర గాయాలు అవడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆయన కోలుకుంటున్నారని, వైద్యులు కూడా చెప్పారు. అయితే, శనివారం కత్తి మహేశ్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు.

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు..

గత నెల 26న నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై కత్తి మహేశ్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా తల, కంటి భాగాల్లో గాయాలవడంతో శస్త్రచికిత్స కూడా చేశారు. మహేశ్ వైద్యానికి ఏపీ ప్రభుత్వం రూ.17 లక్షలు సాయం చేసింది. అయినా కూడా కత్తి మహేశ్‌ ప్రాణాలు దక్కలేదు.

సినీ ప్రస్థానం..

చిత్తూరు జిల్లాలో జన్మించిన కత్తి మహేశ్‌ కుమార్‌.. అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. సినీ దర్శకుడు కావాలనే కోరికతో పలు ప్రయత్నాలు చేశారు. 2011లో దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించిన ‘ఊరు చివర ఇల్లు’ కథ ఆధారంగా ఒక షార్ట్‌ ఫిల్మ్‌ తీశారు. ‘మిణుగురులు’ చిత్రానికి సహ రచయితగా వ్యవహరించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘పెసరట్టు’ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో నటుడిగా మారారు. ముఖ్యంగా ‘హృదయకాలేయం’లో పోలీస్‌ ఆఫీసర్‌గా, ‘నేనే రాజు నేనే మంత్రి’లో టీ అమ్మే వ్యక్తిగా, ‘కొబ్బరిమట్ట’లో రైతుగా నటించి మెప్పించారు. ఆ తర్వాత ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’, ‘క్రాక్‌’ తదితర చిత్రాల్లోనూ మెరిశారు.

ఇదీ చదవండి:

KATHI MAHESH : విమర్శకుడు "కత్తి"... నటుడెలా అయ్యాడంటే....?

ABOUT THE AUTHOR

...view details