టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై భాజపా కార్యకర్తల దాడిని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదని స్పష్టం చేశారు. తమ వాదనతో ఒప్పించడం చేతకాక, దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. భాజపా తీరును ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలన్నారు.
"గతంలోనూ భాజపా భౌతిక దాడులకు ప్రయత్నించింది. తెరాస కార్యకర్తలను కాపాడుకునే శక్తి, బలం, బలగం మాకు ఉన్నాయి. తెరాస కార్యకర్తల ఓపిక నశిస్తే.. భాజపా కనీసం బయట తిరగలేదు. ప్రశాంతమైన తెలంగాణలో చిచ్చుపెట్టాలని భాజపా చూస్తోంది. భాజపా కుటిలప్రయత్నాలను ప్రజలు గమనించాలి. భాజపా నేతలను నిలదీయాలని విజ్ఞప్తి చేస్తున్నా."