మేడారం అంటేనే లక్షలాది భక్తుల కోలాహలం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే కుటుంబాలు 2, 3 రోజులు ఇక్కడే ఉండి అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్న అనంతరం తిరుగు ప్రయాణం అవుతారు. ఇక్కడ తాత్కాలికంగా సేద తీరేందుకు వెదురు బొంగులతో గుడారాలను నిర్మించుకుంటారు. అయితే ఇది శ్రమతో కూడుకున్న పని.
కొందరికి ఉపాధి మార్గం
మేడారం, రెడ్డిగూడెం గ్రామస్థులు భక్తులకు తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. తమ ఇంటి ప్రాంగణంలోని ఖాళీ స్థలాల్లో ఎండు కర్రలు, సంచులు, గడ్డిని ఉపయోగించి తాత్కాలిక గుడారాలను నిర్మిస్తున్నారు. జాతరకు వచ్చే వారి కోసం సిద్ధంగా ఉంచుతున్నారు. అవి 5 నుంచి 20 మంది పట్టేంత విశాలంగా ఉంటాయి. ఐదుగురు పట్టే గదులకు 800 రూపాయలు వసూలు చేస్తుండగా.. 20 మంది పట్టే వాటికి 2 వేల నుంచి 3 వేల రూపాయలు వరకు అద్దె నిర్ణయిస్తున్నారు.