ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దెబ్బతిన్న వ్యాపారాలు... మూతపడుతున్నాయి దుకాణాలు

కరోనా వైరస్‌ వ్యాప్తితో ఒక్కసారిగా అందరి అంచనాలు తారుమారయ్యాయి. భవిష్యత్తుపై పెట్టుకున్న ఆశలు ఆవిరైపోయాయి. వాణిజ్య, వ్యాపారపరంగా ముందుకు దూసుకుపోతున్న జిల్లాల్లో కరోనా కారణంగా పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. ఆంక్షల సడలింపుతో.. దుకాణాలు తెరచుకున్నా.. వ్యాపారం మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. మరోవైపు అద్దె కోసం యజమానుల నుంచి ఒత్తిడి మరింత కష్టంగా మారింది.

lock down effect
lock down effect

By

Published : Jun 13, 2020, 11:42 PM IST

కరోనా ప్రభావంతో అన్నిరకాల దుకాణాలు, వ్యాపారాలు మూతపడడంతో కోట్లల్లో లావాదేవీలు పతనమయ్యాయి. దీంతో వ్యాపార, వాణిజ్య రంగాలు మరో ఏడాది వరకు కోలుకోవడం కష్టమే. చాలామంది వ్యాపారులు సీజన్‌ కోసం బ్యాంకుల్లోనూ, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి పెద్దమొత్తంలో అప్పులు తీసుకున్నారు. ప్రస్తుతం అప్పుల చెల్లింపు, సిబ్బందికి వేతనాల చెల్లింపుతో పాటు షోరూంలు, గోదాంల కిరాయిలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే మరో రెండు, మూడేళ్ల వరకు వ్యాపార వాణిజ్య రంగాలు కుదుటపడేలా లేవు.

లాక్​డౌన్ సడలింపుతో దుకాణాలు తెరుచుకున్నా.. ఇప్పుడు కనీస స్థాయిలో వినియోగదారులు రాని పరిస్థితి. దుకాణాలు తెరిచీ తెరవగానే 3 నెలల అద్దె చెల్లించాల్సిన దుస్థితి నిర్వాహకులకు కష్టంగా మారింది. చిన్న దుకాణాదారుల నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ నిర్వాహకుల వరకు అందరిదీ ఇదే పరిస్థితి నెలకొందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దుకాణాల అద్దెలు చెల్లించడానికి రోజువారీ ఫైనాన్షియర్ల వద్ద అప్పు తీసుకున్నాం. లేదా నగలు తాకట్టు పెట్టి యజమానికి చెల్లిస్తున్నాం. దుకాణాలు తెరిచినా.. వ్యాపారాలు అంతంత మాత్రమే. ఖర్చులకు సరిపడా రాబడి రావడం లేదు. మావాళ్లు చాలామంది దుకాణాలు మూసేసేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు ఇప్పటికే మూసేశారు. అయినా అద్దెల బాధ తప్పేలా లేదు. -వ్యాపారుడు

మరోవైపు హోటళ్లు తెరచుకున్నా కరోనా భయంతో ప్రజలు పూర్తిగా బయట ఆహార పదార్ధాలు తినడం మానేశారు. అందువల్ల గతంలో జరిగిన వ్యాపారంలో పదోవంతు వ్యాపారం జరగట్లేదు. దానికి తోడు.. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా అన్ని దుకాణాల్లో నివారణ చర్యలు, శానిటైజర్ల వినియోగంతో నిర్వహణ ఖర్చులు పెరిగాయి.

మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పటికిప్పుడు అద్దెలు కట్టమంటే వ్యాపారం లేకుండా ఎలా కడుతాం. ఈ 3 నెలలు అద్దెకి కాస్త గడువు ఇవ్వాలి. కాంట్రాక్టు పద్ధతుల్లో దుకాణాలు తీసుకున్న యజమానుల పరిస్థితి అస్సలు బాలేదు. లక్షల్లో ఒప్పందాల ద్వారా దుకాణాలు దక్కించుకుని ఇప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి- -దుకాణం దారుడు

ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 222 కరోనా పాజిటివ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details