అమరావతి పరిరక్షణ సమితి ఏర్పాటు చేసిన జనభేరి బహిరంగకు బయట ప్రాంతాల నుంచి ఎవరూ రాకుండా పోలీసుల ఆంక్షలు విధించారు. సభకు సంఘీభావంగా బయల్దేరిన పలువురు నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. జనభేరి సభకు వెళ్లకుండా కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులకు పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. చందర్లపాడులో కోట వీరబాబును గృహ నిర్బంధం చేశారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంటి ముందు పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. నీటి సంఘాల నేత ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావును గృహనిర్బంధం చేశారు. కృష్ణా జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ ఛైర్మన్ గొర్రెపాటి గోపీచంద్‌ని గృహ నిర్బంధం చేశారు. కంచికచర్ల, వీరులపాడు మండలాల్లోనూ పలువురు తెలుగుదేశం నాయకులకు నోటీసులు జారీ చేశారు.
జనభేరి సభకు వెళ్లకుండా... గుంటూరులో పలువురు నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారు. గుంటూరులోని తన నివాసంలో నక్కా ఆనందబాబును గృహనిర్బంధం చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావును పోలీసులు అడ్డుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలోనూ గృహనిర్బంధాలు కొనసాగుతున్నాయి. అచ్చంపేటలో చినరాజప్పను గృహనిర్బంధం చేశారు. రంపచడవరంలో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిని, అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, రాజమహేంద్రవరం రైతు కమిటీ అధ్యక్షుడు సిరసపల్లి నాగేశ్వరరావును పోలీసులు అడ్డుకున్నారు. జనభేరి సభకు వెళ్లకుండా రాజోలు మండలం తాటిపాకలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును గృహ నిర్బంధం చేశారు. కొత్తపేట నియోజకవర్గంలోని కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాల్లోని తెలుగుదేశం నాయకులు ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.