KCR on BRS: తెలంగాణ రాష్ట్ర సమితే.. భారత్ రాష్ట్రీయ సమితి లేదా భారత్ రాజ్య సమితి (భారాస) పేరిట జాతీయ పార్టీగా రూపాంతరం చెందనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న కారు గుర్తును యథాతథంగా జాతీయపార్టీలోనూ కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పార్టీ జెండా, గుర్తులను గులాబీ రంగులోనే ఉంచి...తెలంగాణ చిత్రపటం స్థానంలో భారతదేశ పటాన్ని చేర్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన కార్యాచరణను శనివారం ప్రారంభించారు. తొలుత కొత్త జాతీయ పార్టీకి భారత్ రాష్ట్రీయ సమితి అనే పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ భావించారు.
తాజాగా ఆయన ‘భారత్ రాజ్య సమితి’ అనే పేరును కూడా పరిశీలిస్తున్నారని తెలిసింది. భారతదేశంలోని రాష్ట్రాల సమాఖ్య లేదా కూటమి అనే అర్థం వచ్చేలా ఉండడంతో దీనిపైనా చర్చిస్తున్నట్లు సమాచారం. పార్టీ పేరు మార్పుపై ఈ నెల 19న జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసి.. కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు సమాచారం. పార్టీ పేరు మార్పుపై ఈ నెల 19న జరిగే తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసి.. కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం దేశంలో 8 జాతీయ పార్టీలు, 54 ప్రాంతీయ పార్టీలు, 2,797 గుర్తింపు లేని పార్టీలు నమోదై ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్, భాజపా, బహుజన్ సమాజ్ పార్టీ, సీపీఐ, సీపీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్‌లు జాతీయ పార్టీలు. వీటిల్లో ఎన్సీపీ, ఎన్పీపీ, తృణమూల్ కాంగ్రెస్‌లు ప్రాంతీయ పార్టీలుగా ఉండి జాతీయ పార్టీలయ్యాయి. మిగిలిన పార్టీల పేరు మారలేదు కానీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పేరుకు ముంద]ు అఖిలభారత చేర్చి జాతీయ పార్టీగా తీర్మానం చేసి పంపగా...ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం తెరాస తెలంగాణ రాష్ట్రం పేరుతో ఏర్పాటై ఉంది. దానికి జాతీయ స్థాయి రూపు రావడానికి భారత్ రాష్ట్రీయ సమితిగా పేరు మార్చాలని సీఎం భావిస్తున్నారు.