తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావుకు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ హిమాకోహ్లి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడంతో.. అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావుకు సీజే కార్యాలయం బాధ్యతలు అప్పగించారు. జస్టిస్ హిమాకోహ్లీ రిలీవ్ కాగానే జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు బాధ్యతలు చేపట్టాలని పేర్కొంటూ కేంద్ర న్యాయశాఖ గెజిట్ విడుదల చేసింది.
జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, భారత లా కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ ఎం.జగన్నాథరావు కుమారుడు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన జస్టిస్ ఎమ్మెస్సార్ ఉస్మానియా యూనివర్సిటీలో 1989లో ఎల్ఎల్బీ, కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం చదివారు. న్యాయవాదిగా 1989 సెప్టెంబరు 7న పేరు నమోదు చేసుకున్న జస్టిస్ రామచంద్రరావు ఐఆర్డీఏ, ఎస్బీఐ, ఎస్బీహెచ్, డీసీసీబీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, రాష్ట్ర ఆర్థిక సంస్థ, ఐపీఈ, సెబీ, తదితర సంస్థలకు న్యాయవాదిగా చేశారు. ఉమ్మడి ఏపీ ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా కూడా పనిచేశారు. న్యాయవాదిగా పలు సివిల్, కంపెనీ, పరిపాలన, ఆర్బిట్రేషన్ కేసులను వాదించారు.
ఉమ్మడి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 2012 జూన్ 29న నియమితులైన జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు... 2013 డిసెంబరు 4 నుంచి న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకం కోసం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం 9 మంది పేర్లను సిఫారసు చేసింది. ఆ తొమ్మిది మందిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ పేరును కొలీజియం సిఫారసు చేసింది. కొలీజియం ఇటీవల సిఫార్సు చేసిన 9 మంది కొత్త న్యాయమూర్తుల పేర్లకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. దీంతో ఆ నియామకాలను ఖరారు చేస్తూ గురువారం సాయంత్రం కేంద్ర న్యాయ శాఖ విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేసింది.
కొత్త న్యాయమూర్తులతో ఈ నెల 31న ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమం మంగళవారం ఉదయం 10.30గంటలకు జరగనుంది. జస్టిస్ హిమా కోహ్లీ సుప్రీం న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావుకు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి: JAGAN CASE : ఆ ఛార్జ్‌షీట్ నుంచి నన్ను తొలగించండి: సీఎం జగన్