టికెట్ ఇస్తే ఒక నినాదం. రాకపోతే మరో నినాదం. ఇలా... టికెట్ల కోసం నేతల వలసలు, సీట్ల కోసం పార్టీల పాట్లతో గ్రేటర్ హైదరాబాద్‌లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. బల్దియా ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్ వెలువడిన మరుక్షణమే... నేతల టికెట్ రాజకీయాలు ఊపందుకున్నాయి.
అభ్యర్థుల ఎంపిక విషయంలో శాసనసభ ఎన్నికల వ్యూహాన్నే గ్రేటర్ ఎన్నికల్లోనూ అమలు చేసే దిశగా... అధికార తెరాస నిర్ణయించినట్లు తెలుస్తోంది. తీవ్రమైన అభియోగాలుండి పార్టీకి నష్టదాయకం, తప్పనిసరి అనుకున్న వారిని మాత్రమే మినహాయించాలని పార్టీ భావించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో తెరాస తరఫున 99 మంది కార్పొరేటర్లు గెలవగా.. ఆ తర్వాత మరో ముగ్గురు ఇతర పార్టీల నుంచి తెరాసలో చేరారు. అంతర్గత సర్వేలో చిన్నాచితకా మినహా ఎక్కడా కార్పొరేటర్లపై వ్యతిరేకత లేదని తేల్చిన నాయకత్వం.. రిజర్వేషన్లూ యథాతథంగా ఉన్నందున ప్రస్తుత కార్పొరేటర్లకే మళ్లీ అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
అభ్యర్థుల జాబితా కేటాయించిన తర్వాత అసంతృప్తులు, అసమ్మతులకు.. విపక్షాలు గాలం వేసే అవకాశం ఉన్నందున.. వారిని బుజ్జగించేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకత్వం ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఇందులో భాగంగానే అభ్యర్థుల జాబితా ప్రకటనపై ఆచితూచి వ్యవహరిస్తోంది. టికెట్ ఆశిస్తున్న వారిని చివరి వరకు ఆశల పల్లకిలోనే ఉంచి... పార్టీ ప్రకటించిన వారికి బీ ఫారం ఇవ్వాలని భావిస్తోంది.
ఆ ఇద్దరిదీ అదే దోస్తీ...
గతంలో మాదిరిగానే ఎంఐఎం, అధికార పార్టీల స్నేహపూర్వక బంధం ఈ ఎన్నికల్లోనూ కొనసాగనుంది. తెరాస అభ్యర్థులు పోటీచేస్తున్న 150 డివిజన్లలో.... దాదాపు 50 స్థానాల్లో మజ్లిస్ స్నేహపూర్వకంగా పోటీకి దిగింది. ఇటీవల ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీతో తెరాస అధినేత కేసీఆర్ చర్చించారు.