ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సౌకర్యాల కల్పనతో సర్కారీ ఆసుపత్రులకు మహర్దశ - telangana government hospitals updates

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోడానికి తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చేపట్టిన చర్యలు సర్కారీ ఆసుపత్రులను బలోపేతం చేశాయి. కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు అత్యవసరంగా నెలకొల్పిన మౌలిక వసతులు.. భవిష్యత్‌ అవసరాలకూ ఉపయోగకరంగా మారనున్నాయి.

infrastructure
infrastructure

By

Published : Nov 19, 2020, 10:05 AM IST

తెలంగాణలో సర్కార్​ ఆస్పత్రుల దశ తిరుగుతోంది. కొవిడ్‌ చికిత్స, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.912 కోట్లను మంజూరు చేయడం వల్ల.. సర్కారీ దవాఖానాల్లో అత్యాధునిక ప్రయోగశాలలు అందుబాటులోకి వచ్చాయి. ఒకరకంగా చెప్పాలంటే.. కరోనా గడ్డుకాలంలోనూ ప్రభుత్వ ఆసుపత్రులకు మంచే జరిగింది. ఇప్పుడు నెలకొల్పిన ఈ మౌలిక వసతులు.. కొవిడ్‌ తీవ్రత తగ్గిన తర్వాతా భవిష్యత్‌ అవసరాలకు ఉపయోగపడతాయని వైద్యవర్గాలు తెలిపాయి. ఆధునిక సదుపాయాల ఫలితంగా గ్రామీణంలోనూ వైద్యసిబ్బంది ఇంటింటికీ పర్యటిస్తూ.. ఆక్సిజన్‌ శాతాన్ని, పల్స్‌రేటును, జ్వరాన్ని పరిశీలించడానికి అవకాశాలేర్పడ్డాయి.

నిమ్స్‌లో అత్యాధునిక ప్రయోగశాల

కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్‌లో రూ.7 కోట్ల విలువైన ‘కొబాస్‌ 8800’ యంత్రాన్ని నెలకొల్పింది. దానిని నిర్వహించడానికి సుమారు రూ.కోటిన్నరతో అత్యాధునిక ప్రయోగశాలను అభివృద్ధి చేశారు.

ఇది పూర్తిగా ఆటోమేటెడ్‌ మిషన్‌. కరోనా నిర్ధారణలో 4 రకాల విధానాలుంటాయి. ఒక్కసారి నమూనాను ఈ యంత్రంలో అమర్చితే.. అన్ని విధానాల్లో పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఫలితాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తుంది. రోజుకు 4,000 కొవిడ్‌ పరీక్షలను నిర్వహించగలిగే సామర్థ్యం దీని సొంతం. దీనివల్ల రాష్ట్రంలో రోజుకు 10,000కు పైగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలను ప్రభుత్వ వైద్యంలో చేపట్టే అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ యంత్రం క్షయ, హెచ్‌ఐవీ, హెచ్‌పీవీ తదితర దాదాపు 100 రకాల నిర్ధారణ పరీక్షలను చేయడానికి ఉపయోగపడుతుంది. అవయవ మార్పిడి శస్త్రచికిత్సల్లో దాతకు, స్వీకర్తకు నిర్వహించే కీలక పరీక్షలు, లైంగిక వ్యాధులు, శ్వాసకోశ, జీర్ణకోశ, యాంటీమైక్రోబయాల్‌ నిర్ధారణ పరీక్షలను సులువుగా చేయొచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యంలో 18 ప్రయోగశాలల్లో ఆర్‌టీపీసీఆర్‌/సీబీనాట్‌/ట్రూనాట్‌ విధానంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తుండగా.. త్వరలో మరో 17 నెలకొల్పనున్నారు. వీటికి సంబంధించిన యంత్రాల కొనుగోలు ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. దీంతో జిల్లాల్లోనూ అత్యాధునిక ప్రయోగశాలలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో 1,076 యాంటిజెన్‌ పరీక్ష కేంద్రాలున్నాయి.

ప్రాణవాయువుకు పెద్దపీట

మార్చి 2020కి ముందు ప్రభుత్వ వైద్యంలో నిమ్స్‌, ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ఎంజీఎం ఆసుపత్రుల్లో మాత్రమే ద్రవీకృత ప్రాణవాయు సరఫరా ఉంది. కొవిడ్‌ వల్ల ఆక్సిజన్‌ అవసరాలు పెరగడంతో.. వీటిల్లో ఇప్పటికే ఉన్న నిల్వ సామర్ధ్యాన్ని దాదాపు రెట్టింపు కంటే అధికంగా పెంచారు. వీటికి అదనంగా కొత్తగా మరో 21 ఆసుపత్రుల్లో ద్రవీకృత ప్రాణవాయు ట్యాంకులను నెలకొల్పనున్నారు. ఇప్పటికే టిమ్స్‌, కింగ్‌ కోఠి, ఛాతీ ఆసుపత్రి, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్‌ ఆసుపత్రుల్లో ఈ సేవలు ప్రారంభమవగా.. సూర్యాపేట, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, నల్గొండ, మెదక్‌, తాండూరు, ఫీవర్‌ ఆసుపత్రి(హైదరాబాద్‌), కొండాపూర్‌, సింగరేణి ఆసుపత్రి(మంచిర్యాల), భద్రాచలం, కొత్తగూడెం, నాగార్జునసాగర్‌, భైంసా, ఆర్మూర్‌ తదితర ప్రభుత్వ ఆసుపత్రుల్లో త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్‌ సేవల కోసం 5,000కు పైగా ప్రాణవాయు సిలిండర్లను అదనంగా అందుబాటులోకి తెచ్చారు.

8,000కు పైగా ఆక్సిజన్‌ పడకలు...

*రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన టిమ్స్‌ ఆసుపత్రిని ప్రారంభించింది. ఇందులో మొత్తం 1,500 పడకలు ఉండగా.. కొవిడ్‌ సేవల కోసం 1,224 పడకలను కేటాయించారు. వీటిలో 980 ఆక్సిజన్‌, 50 ఐసీయూ పడకలున్నాయి.
*రాష్ట్రంలోని మొత్తం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 10,010 ఆక్సిజన్‌ పడకలుండగా.. వీటిలో 80 శాతం అంటే దాదాపు 8,000కు పైగా పడకలను కొవిడ్‌ రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాతే(మార్చి 2020 తర్వాత)నే ఏర్పాటు చేశారు.
*ప్రభుత్వ ఆసుపత్రుల్లో మార్చి నాటికి సుమారు 450 వెంటిలేటర్లు ఉండగా.. గత ఆరు నెలల్లోనే అదనంగా మరో 1,259 సమకూర్చారు.
*కొత్తగా 12 సీటీ స్కాన్‌లు, 2 ఎంఆర్‌ఐ యంత్రాల కొనుగోలుకు టెండరు ప్రక్రియ పూర్తయింది.
*రెమిడెసివిర్‌, టోసిలిజుమాబ్‌ వంటి ఖరీదైన ఇంజక్షన్లు, ఫావిపిరవిర్‌ మాత్రలు అందుబాటులోకి వచ్చాయి.
*కొవిడ్‌ సేవల కోసం కొత్తగా 100 అంబులెన్సులను సమకూర్చారు. ఇవి మున్ముందు సాధారణ అవసరాలకు ఉపయోగపడతాయి.
*ఈ ఏడాది మార్చి నుంచి నవంబరు 18 వరకూ జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యవసరంగా 40 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
*కరోనా సేవల కోసం ప్రభుత్వం కొత్తగా 5,209 పోస్టులు మంజూరు చేసింది. వీటిలో వైద్యుల పోస్టులు 1,899, నర్సులవి 2,125, పారామెడికల్‌, సహాయక సిబ్బంది కలుపుకొని 1,185 ఉద్యోగాలు ఉన్నాయి.

సమకూరిన పరికరాలు

*200 హై ఫ్లో నాసల్‌ ఆక్సిజన్‌ పరికరాలు
*172 బైపాస్‌ ఆక్సిజన్‌ పరికరాలు
*300 నాన్‌ ఇన్‌వేజివ్‌ వెంటిలేటర్లు
*2,000 ఐసీయూ పడకలు
*2,000 ఐసీయూ మానిటర్లు
*524 మల్టిపుల్‌ మానిటర్లు
*512 ఐసీయూల్లో వినియోగించే పల్స్‌ ఆక్సిమీటర్లు
*27,264 వేలికి తగిలించే పల్స్‌ ఆక్సిమీటర్లు
*13,570 ఇన్‌ఫ్రారెడ్‌ థర్మామీటర్లు
*1000 బల్క్‌ సిలిండర్లు
*5000 పడక పక్కన వినియోగించే సిలిండర్లు
*65 కంప్యూటరైజ్డ్‌ రేడియోగ్రఫీ పరికరాలు
*30 డిజిటల్‌ ఎక్స్‌రే పరికరాలు
*65 పోర్టబుల్‌ ఎక్స్‌రే పరికరాలు

అనేక పరిశోధనలు చేయొచ్చు...

కొబాస్‌ 8800 అందుబాటులోకి రావడం వల్ల ఎక్కువసంఖ్యలో నమూనాలను పరీక్షించగలిగే సామర్థ్యం పెరిగింది. దీంతోపాటు నాణ్యత ప్రమాణాలు పెరిగాయి. ఈ ల్యాబ్‌ మున్ముందు ‘అడ్వాన్స్‌డ్‌ మాలిక్యులర్‌ డయాగ్నోస్టిక్స్‌ ల్యాబ్‌ క్లినికల్‌ రీసెర్చి’కి ఉపయోగపడుతుంది. అనేక పరిశోధనలూ చేయొచ్చు.

- డాక్టర్‌ కె.మధుమోహనరావు వైరాలజీ విభాగం అధిపతి, నిమ్స్‌

సర్కారు ముందుచూపుతో..

కరోనా ఉద్ధృతిని దృష్ట్యా ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మౌలిక వసతుల కల్పన వేగంగా జరిగేలా చూశారు. సమర్థ సేవలందించేలా సర్కారు దవాఖానాల్లో సౌకర్యాలు మెరుగుపరచుకోగలిగాం.

-చంద్రశేఖరరెడ్డి ఎండీ, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ

ఇదీ చూడండి:

అక్రమ నిర్బంధం వ్యాజ్యాల్లో విచారణ వాయిదా వేయడం కుదరదు: హైకోర్టు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details