ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్​లో ఉగ్ర కుట్ర కేసు.. దర్యాప్తులో వెలుగులోకి సంచలన అంశాలు..!

Hyderabad terror case: తెలంగాణలోని హైదరాబాద్‌లో భారీ విధ్వంసానికి కుట్రపన్నిన కేసు దర్యాప్తులో పోలీసులకు సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. దాడులకు పాకిస్థాన్​ నుంచే పథక రచన చేసినట్లు పోలీసులు గుర్తించారు. సాంకేతికత సహాయంతో పాకిస్థాన్​ సరిహద్దు నుంచే డ్రోన్ల ద్వారా భారత్‌కు ఆయుధాలు చేరవేశారు. 20 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉండి దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు చేయిస్తోన్న ఫర్హతుల్లా ఘోరీ కనుసన్నల్లోనే పేలుళ్ల కుట్ర చేసినట్లు విచారణలో వెల్లడైంది. రెచ్చగొట్టే ప్రసంగాలతో దాడులకు ప్రేరేపించాడు.

Hyderabad terror case
Hyderabad terror case

By

Published : Oct 4, 2022, 9:35 AM IST

హైదరాబాద్​లో ఉగ్ర కుట్ర కేసు.. దర్యాప్తులో వెలుగులోకి సంచలన అంశాలు

Hyderabad terror case: తెలంగాణలోని భాగ్యనగరంలో భాజపా, ఆర్​ఎస్​ఎస్​ నేతలు, పండుగలను లక్ష్యంగా చేసుకొని మారణహోమం సృష్టించేందుకు అబ్దుల్ జాహెద్, మహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ పరూక్ కుట్ర పన్నినట్లు తేటతెల్లమైంది. సిట్, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసిన నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి.. రిమాండ్‌కు తరలించారు. ముగ్గురు నిందితుల్లో అబ్దుల్ జాహెద్‌కు 22 ఏళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నాయి. అతడి ప్రసంగాలతో మహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ పరూక్ తీవ్రవాదంవైపు ఆకర్షితులయ్యారు.

2018లో ఐసిస్‌లో చేరేందుకు సిరియా పయనమైన ఇద్దరిని ముంబయి విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. స్థానిక యువతను ఆకట్టుకొని ఉగ్రవాద సంస్థల్లోకి ముగ్గురూ రిక్రూట్‌మెంట్‌ చేపట్టారు. దీనికి అవసరమైన నిధులు పాకిస్థాన్​ నుంచి చేరుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు. గ్రనేడ్లు నగరానికి ఎవరు తీసుకొచ్చారు. ఏ మార్గంలో వీరికి చేర్చారు.. దీని వెనుక జరిగిన వ్యవహారాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మారాడు అనుకుంటే పాత లింకులు బయలు..: పాకిస్థాన్‌లో తలదాచుకున్న 62 ఏళ్ల ఫర్హతుల్లా అలియాస్ అబు సుఫియాన్ అలియాస్ సర్దార్ సాహెబ్ మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌. కేంద్రం ప్రకటించిన వ్యక్తిగత ఉగ్రవాదుల జాబితాలో ఒకడు. సైదాబాద్‌లోని కూర్మగూడ అతని స్వస్థలం. మైనార్టీ సంస్థలో పనిచేసిన ఘోరీ 1981లో బయటకు వచ్చాడు. సౌదీ అరేబియాలో చేరి అక్కడి నుంచే లష్కరే తోయిబా, జైషే ఈ మహ్మద్ తదితర ఉగ్రవాద సంస్థలకు పనిచేస్తున్నాడు. దేశంలో పలు బాంబు పేలుళ్లలో ఇతడు ప్రధాన సూత్రధారి. ప్రస్తుతం పాకిస్థాన్​కు మకాం మార్చాడు. అతడి వ్యక్తిగత సహాయకుడు తాజాగా అరెస్టయిన అబ్దుల్ జాహెద్ సోదరుడు మాజిద్ పని చేస్తున్నాడు.

2005లో టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న బంగ్లాదేశ్​కు చెందిన డాలిన్​కు జాహెద్ వసతి కల్పించాడు. ఈ కేసులో అరెస్టయి 2017లో జైలు నుంచి విడుదలయ్యాడు. 12 ఏళ్ల పాటు జైల్లో ఉన్న జాహెద్ బయటకు వచ్చాక వెల్డింగ్ దుకాణం, స్తిరాస్థి వ్యాపారంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జాహెద్ ఉగ్రవాదం వదిలేసి మారాడనే భావించినప్పటికీ.. రెండేళ్ల తరవాత పాత పరిచయాలను పునరుద్ధరించాడు. పాకిస్థాన్​లో ఉన్న సోదరుడు మాజిద్ అందుబాటులోకి రావటంతో భావసారుప్యత గల యువకులను ఎంపిక చేశాడు. పాకిస్థాన్​ ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థల నుంచి వచ్చే ఆదేశాలతో గుట్టుగా కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చాడు. వీరి కదలికలను ఎప్పటికప్పుడు అంచనా చేస్తున్న కేంద్ర నిఘా సంస్థలు నగర పోలీసులను అప్రమత్తం చేయటంతో ఉగ్రకుట్రను భగ్నం చేశారు.

నిఘా సంస్థలకు దొరకకుండా.. రిక్రూట్‌మెంట్‌, గ్రనేడ్స్ రవాణా, పేలుళ్ల కుట్ర బయటపడకుండా ఉగ్రమూకలు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నిఘా సంస్థలు, పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఎన్‌క్రిఫ్ట్‌ యాప్​ను ఉపయోగించారు. దాని ద్వారానే కోడ్ భాషలో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపారు. ప్రస్తుతం ఎన్‌క్రిఫ్ట్‌ యాప్‌లో పాక్‌ ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థలతో పంచుకున్న అంశాలు, చాటింగ్‌ను పోలీసులు డీకోడ్ చేసే పనిలో ఉన్నారు. ఇంత భారీ కుట్రను అమలు చేసేందుకు సహకరించిన వారి వివరాలు సేకరిస్తున్నారు. సుమారు 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై కేంద్ర నిఘావర్గాలు, దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నట్టు సమాచారం. పాకిస్థాన్​ నుంచి కశ్మీర్ చేరిన గ్రనేడు.. నగరానికి ఎవరి ద్వారా చేరవేశారనే దానిపై వివరాలు రాబడుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details