కటికనేని సోదరుల అపహరణ కేసులో కీలకంగా వ్యవహరించిన గుంటూరు శ్రీను కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. భూమా నాగిరెడ్డికి సహాయకుడిగా ఉంటూ ఎంతో నమ్మకం పొందిన గుంటూరు శ్రీను... వాళ్ల కుటుంబానికి చెందిన అన్ని విషయాలను దగ్గరుండి మరీ చూసుకునేవాడు. భూమా నాగిరెడ్డి మరణాంతరం... ఏవీ సుబ్బారెడ్డితో భూమా అఖిలప్రియకు విభేదాలు తలెత్తిన సమయంలో గుంటూరు శ్రీను అఖిలప్రియకు మద్దతుగా నిలిచాడు. ఈ క్రమంలోనే ఏవీ సుబ్బారెడ్డిని చంపేందుకు కుట్ర పన్ని పోలీసులకు దొరికిపోయాడు.
ఈ కేసులో కడప జైల్లో రెండు నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉండి బెయిల్పై బయటికి వచ్చాడు. హఫీజ్పేట్ భూమి విషయంలోనూ కటికనేని సోదరులతో తలెత్తిన విభేదాల కారణంగా... వాళ్లను అపహరించడానికి దాదాపు రెండు నెలల క్రితం ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు శ్రీను... పలుమార్లు బోయిన్పల్లి పరిసరాల్లో సంచరించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు.