Hyderabad Tension: హైదరాబాద్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు, నిరసనలు, అరెస్టుల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు భద్రతా చర్యలను పటిష్ఠం చేశారు. ప్రధానంగా పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో అడుగడుగునా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం మక్కా మసీదుతో పాటు నగర వ్యాప్తంగా ముస్లింల ప్రార్థనలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక నిఘా ఉంచారు. ఎట్టకేలకు అన్నిచోట్లా ప్రార్ధనలు ప్రశాంతంగా ముగియటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేయటం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. దీంతో భాజపా అధిష్ఠానం ఆయనపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. పోలీసులు రాజాసింగ్‌ను అరెస్టు చేయగా సాయంత్రమే నాంపల్లి కోర్టు బెయిల్ ఇవ్వటంతో ఆయన బయటికి వచ్చారు. ఈ క్రమంలోనే మరోసారి రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చింది. దీంతో పోలీసులు రాజాసింగ్ పై పీడీ చట్టం కింద కేసు నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.
రాజాసింగ్ పై పీడీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బేగంబజాల్, ఎంజే మార్కెట్ లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. బేగంబజార్ వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసి వేసి నిరసన తెలిపారు. ఈ రోజు సైతం నిరసనలు కొనసాగే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలకు నిరసనగా పాతబస్తీలో గత మూడు రోజుల నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమ మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న రాజాసింగ్ పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ నిరసనలు చేపట్టారు.