తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరం అంతర్జాతీయ డేటా కేంద్రాలకు హబ్‌గా మారుతోంది. అమెజాన్ వెబ్‌సర్వీస్ సంస్థ రూ. 20,000 కోట్ల భారీ పెట్టుబడితో డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ముందుకు వచ్చింది. మరో నాలుగు అంతర్జాతీయ సంస్థలు భారీ పెట్టుబడులతో డేటా కేంద్రాల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. భూముల లభ్యత, మౌలిక వసతులు, మానవ వనరుల లభ్యత తదితర అంశాలపై ఐటీశాఖతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఈ సంస్థల పెట్టుబడుల విలువ భారీగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వీటికి అనుమతి లభించి కార్యకలాపాలు ప్రారంభిస్తే హార్డ్‌వేర్, ఐటీ రంగాల పరిశ్రమలకు మరింత మేలుతో పాటు భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశముందని ఐటీశాఖ అంచనా వేస్తోంది. సేవా ఆధారిత డేటా కేంద్రాలతో భారీగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశముంది.
అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలతో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు కేంద్రస్థానంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డేటా సెంటర్లకు ప్రత్యేక విధానంతో పాటు పన్ను రాయితీలు కల్పిస్తోంది. నగరంలో నిపుణులైన మానవ వనరులు అందుబాటులో ఉండటంతో అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. ముంబయి, చెన్నై, దిల్లీ నగరాలతో పోల్చితే ఇక్కడ భూముల లభ్యత ఎక్కువ. ధరలు కాస్త తక్కువ కూడా. నగరంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రత్యేక డేటాసెంటర్లు ఉన్నాయి. ప్రైవేట్ ఐటీ సంస్థలకు సేవలు అందించేందుకు అంతర్జాతీయ సంస్థలు వరస కడుతున్నాయి. జాతీయస్థాయిలో దేశాన్ని డేటాసెంటర్ల కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విధానం తీసుకురానుంది.
అమెజాన్
నగరంలో అమెజాన్ మూడుచోట్ల డేటాసెంటర్లు ఏర్పాటు చేస్తోంది. రంగారెడ్డి జిల్లా చందనవెల్లి, ఫ్యాబ్‌సిటీ, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రూ. 20,761 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాదికి అందుబాటులోకి వస్తాయి.
కంట్రోల్‌ఎస్
కంట్రోల్‌ఎస్ సంస్థ ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ సంస్థలో 2,000 మందికి పైగా పనిచేస్తున్నారు. ముంబయితో పాటు హైదరాబాద్‌లో 2 మిలియన్ల చదరపు అడుగుల స్థలంలో ఏర్పాటైన డేటా సెంటర్లను మరింత విస్తరించడానికి ఆ సంస్థ ఐటీశాఖకు ప్రతిపాదనలు సమర్పించింది.
ర్యాక్‌బ్యాంక్