'రోడ్లు వేసుకునే వ్యక్తి చెబితే పోలవరం ప్రాజెక్టులో మార్పులా!'
పోలవరం రివర్స్ టెండరింగ్ పై తెదేపా అధినేత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైకాపా నాయకులు అనుకున్న వ్యక్తికి కట్టబెట్టేందుకే రివర్స్ టెండరింగ్ చేపట్టారని ఆరోపించారు. నిపుణలు కమిటీ హెచ్చరికలను లెక్క చేయకుండా ప్రభుత్వం ముందుకెళ్తోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ విషయాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని...ఆయనకు రాష్ట్ర పరిస్థితులు ఏం తెలుసునని నిలదీశారు.
గోదావరి జిల్లాల్లో ఒక్క గ్రామం కనిపించదు!
రివర్స్ టెండరింగ్ పేరుతో వైకాపా నాయకులు తాము అనుకున్న వ్యక్తికి ప్రాజెక్టు రిజర్వు చేసేసుకున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రివర్స్ టెండరింగ్ అంటే భద్రతను గాలికి వదిలేయటం అనే కొత్త నిర్వచనం చెప్పారని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైతే వ్యయం పెరుగుతుందని నిపుణలు చెప్పారన్నారు. నిపుణుల కమిటీని కాదని ముందుకెళ్తున్నారని మండిపడ్డారు. రేపు ఏదైనా జరగరానిది జరిగితే ఉభయ గోదావరి జిల్లాలో ఒక్క గ్రామమైన మిగలదని అన్నారు. నచ్చిన సంస్థకు పనులు ఇచ్చేందుకు భద్రత ఫణంగా పెట్టారని దుయ్యబట్టారు. 55లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండే చోట నాణ్యత ప్రమాణాల్లేని సంస్థకు ప్రాజెక్టు కట్టబెట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు. పోలవరం కట్టడమంటే తన ఇంటికి నోటీస్ అంటించిన అంత సులువు అనుకుంటున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎంకి చేతకాకపోతే నిపుణులు చెప్పింది అయినా వినాలని హితవు పలికారు. ఆర్ అండ్ బి రోడ్లు వేసుకునే వ్యక్తి చెప్పినట్లు పోలవరం విషయంలో చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.
కేసీఆర్ పై మండిపాటు..
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై చంద్రబాబు మండిపడ్డారు. పోలవరం ఎత్తు తగ్గిస్తామని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారని... ఏపీ పరిస్థితులు ఏం తెలుసునని ఆయన జోక్యం చేసుకుంటున్నారని నిలదీశారు.
గోదావరి -పెన్నా అనుసంధానమే మేలు
పోలవరం పూర్తిచేసుకుని గోదావరి పెన్నా అనుసంధానం చేసుకుంటే తక్కువ ఖర్చుకే నీళ్లు వస్తాయన్న చంద్రబాబు..., శ్రీశైలం ద్వారా గోదావరి నీళ్లు తీసుకెళ్ళాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి ఇక్కడి ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దన్నారు. అనుకున్న వాళ్లకు ప్రాజెక్టు కట్టబెట్టేందుకు రాష్ట్రాన్ని లూటీ చేస్తారా, వాటాలు ఇవ్వకపోతే ఎవరినైనా కొట్టేస్తారా అని ప్రశ్నించారు. నవయుగ పరిస్థితేంటన్న చంద్రబాబు.. బందరు పోర్టు ఎందుకు రద్దు చేశారని నిలదీశారు. నిపుణుల కంటే జగన్ మేధావా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక విధమైన ఉగ్రవాదం సృష్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని దోచుకోవటానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారన్నారు. పోలవరం విషయంలో రాజీపడేది లేదన్న చంద్రబాబు...గట్టిగా పోరాడతామని తేల్చిచెప్పారు.
TAGGED:
రివర్స్ టెండరింగ్