వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఎప్పటిలోగా ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కాలపరిమితి ముగిసినా జాప్యం చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిర్దిష్ట సమయానికి ఎన్నికలు జరపాలన్న రాజ్యాంగ నిబంధన పాటించాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని ప్రతిసారీ గుర్తుచేయాల్సిన అవసరం ఏమిటని నిలదీసింది. న్యాయస్థానం కళ్లు మూసుకుని ఉండదని.. ప్రభుత్వం స్పందించకపోతే తగిన ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్తో కూడిన ధర్మాసనం.. విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.
ప్రభుత్వానికి నిబంధనలు తెలుసుకదా...?
2018 జూన్ లో సహకార సంఘాల కాలపరిమితి ముగిసిన అనంతరం.. మూడుసార్లు పొడిగించినట్లు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. వాటిని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందన్నారు. అందుకే ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగిందన్నారు. 'జరిగిందేదో జరిగిపోయింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే నిబంధనలు ప్రభుత్వానికి తెలుసుకదా? రాజ్యాంగ నిబంధనల గురించి తెలియకపోతే అధికారుల దృష్టికి తీసుకెళ్లండి' అని న్యాయస్థానం సూచించింది. అన్నింటికన్నా రాజ్యాంగం సర్వోన్నతమైనదని వ్యాఖ్యానించింది. వివరాలు సమర్పించడానికి కొంత సమయం కావాలని జీపీ కోరగా.. ధర్మాసనం అంగీకరించింది.