movie ticket prices increase: తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు థియేటర్లకు హైకోర్టు అనుమతినిచ్చింది. టికెట్ల ధరలపై అధికారులు తుది నిర్ణయం తీసుకునే వరకు.. యాజమాన్యాలు కోరిన ధరలతో థియేటర్లను నిర్వహించేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తమకు అనుమతినివ్వాలని గత నెల చివరి వారంలో మల్టీప్లెక్సులు సహా సుమారు వందకు పైగా థియేటర్ల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ విజ్ఞప్తిపై ప్రభుత్వం స్పందించకపోవటం వల్ల.. థియేటర్ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి.
high budget movie ticket prices: టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ యాజమాన్యాలు హైకోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశాయి. టికెట్ల గరిష్ఠ ధరలపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఇంకా తుది నిర్ణయం తీసుకోవడం లేదని... అప్పటి వరకు తాము ప్రతిపాదించిన టికెట్ల ధరలతో థియేటర్ల నిర్వహణకు అనుమతించాలని యాజమాన్యాలు కోరాయి. వాదనలు విన్న హైకోర్టు... థియేటర్ల అభ్యర్థనను అంగీకరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.