Machilipatnam Port: బందరు పోర్టు ఒప్పందం రద్దు వ్యవహారంలో నవయుగ మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్(ఎన్‌ఎంపీఎల్) సంస్థ దాఖలు చేసిన అప్పీల్లోని అనుబంధ పిటిషన్లను కొట్టేస్తూ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. బందరు పోర్టు పనులను ఇతరులకు అప్పగించకుండా ప్రభుత్వాన్ని నిలువరించాలని, సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించాలని, ఒప్పందాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో, ప్రాజెక్టు అభివృద్ధి చేసే విధానాన్ని పీపీపీ పద్ధతి నుంచి ల్యాండ్‌లాడ్ పద్ధతికి మారుస్తూ ఇచ్చిన జీవోల అమలనును నిలపుదల చేయాలని ఎన్‌ఎంపీఎల్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఏవీ రవీంద్రబాబుతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది. అప్పీల్‌పై డిసెంబర్ మొదటి వారంలో తుది విచారణ జరుపుతామని తెలిపింది.
మచిలీపట్నం పోర్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఏపీ ఇంధన, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల(పోర్ట్స్)శాఖ ముఖ్య కార్యదర్శి 2019 ఆగస్టు 8న జారీచేసిన జీవో 66ను సవాలు చేస్తూ ‘నవయుగ మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్’ సంస్థ డైరెక్టర్ వై.రమేశ్ 2019 సెప్టెంబర్‌లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై తుది విచారణ జరిపిన న్యాయమూర్తి... వ్యాజ్యాన్ని కొట్టేస్తూ ఈ ఏడాది ఆగస్టు 25న తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును సవాలు చేస్తూ ఎన్‌ఎంపీఎల్ ధర్మాసనం ముందు అప్పీల్ వేసింది. మధ్యంతర ఉత్తర్వులిచ్చే వ్యవహారంపై దాఖలైన అనుబంధ పిటిషన్లపై ఇటీవల వాదనలు ముగియడంతో నిర్ణయాన్ని వాయిదా వేసిన ధర్మాసనం తాజాగా నిర్ణయాన్ని వెల్లడించింది. పోర్టు ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని సమర్థిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన (ఈ ఏడాది ఆగస్టు 25న) తేదీన ప్రాజెక్టు నిర్మాణ విషయంలో లోయస్ట్ బిడ్డర్‌కు రాష్ట్ర ప్రభుత్వం అవార్డు లెటరు జారీచేసింది. తర్వాత లోయస్ట్ బిడ్డర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్యం ఒప్పందం కుదిరింది.