Hyderabad Rains Today: హైదరాబాద్‌లో వరుణుడు మరోసారి ప్రతాపం చూపించాడు. రెండో రోజు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతుంది. వానహోరుతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రోడ్లు జలమయమయ్యాయి. కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, అబిడ్స్, బేగంబజార్, ట్రూప్‌బజార్, నాంపల్లి, బషీర్ బాగ్, లక్డీకపూల్ ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. నారాయణగూడ, హైదర్‌గూడ, హిమాయత్‌నగర్ సికింద్రాబాద్, బేగంపేట్, ప్యాట్నీ, ప్యారడైస్ ,చిలకలగూడ, అల్వాల్, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి వరదనీరు రహదారుల పైకి రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు:తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి, మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు వాయువ్య దాని పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతుందని వెల్లడించారు.