ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఒక్కసారిగా వాన.. నిండుకుండలా భాగ్యనగరం

ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం హైదరాబాదీలను ఇబ్బంది పెట్టింది. ఆసిఫ్‌నగర్‌ పరిధిలో ఏకంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్‌, అమీర్‌పేట్‌, ఎర్రమంజిల్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, కాలాపత్తర్​ తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు భారీగా రోడ్లపైకి రావడం వల్ల ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ప్రధాన రహదారులు చెరువులను తలపించగా.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీహెచ్​ఎంసీ సిబ్బంది, పోలీసులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు.

heavy-rain-and-traffic-jam-in-hyderabad
heavy-rain-and-traffic-jam-in-hyderabad

By

Published : Oct 9, 2020, 11:01 PM IST

ఒక్కసారిగా వాన.. నిండుకుండలా భాగ్యనగరం

హైదరాబాద్​లో కురిసిన జోరు వానకు నగరం నిండు కుండను తలపించింది. అల్పపీడన ప్రభావంతో భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని రోడ్లు చెరువులను తలపించాయి. సాయంత్రం సమయంలో వర్షం కురవడం వల్ల ఉద్యోగుల, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

భారీగా ట్రాఫిక్​..

ఖైరతాబాద్‌, అమీర్‌పేట్‌, ఎర్రమంజిల్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, కాలాపత్తర్​ తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు భారీగా రోడ్లపైకి రావడం వల్ల ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. కోఠి కూడలి వద్ద రాకపోకలు స్తంభించాయి. ఆటోలు, కార్లతో సహా జనం నడించేందుకే భయపడ్డారు. ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌ సమీపంలోని జంక్షన్‌లో భారీగా వరద నీరు చేరడం వల్ల ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది మ్యాన్‌హోల్‌ తొలగించేందుకు తీవ్రగా శ్రమించారు. అలాగే బషీర్‌బాగ్ పైవంతెన కింద మోకాళ్ల లోతు వర్షపు నీరు చేరింది. వంతెన కింద అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

పొంగిపొర్లిన డ్రైనేజీలు..

సికింద్రాబాద్​లో రాణిగంజ్, చిలకలగూడ, బేగంపేట్, అల్వాల్, మారేడ్​ పల్లి, బోయిన్​ పల్లి, ప్యారడైజ్​ ప్రాంతాల్లో వర్షం కురిసింది. ప్యారడైజ్, రాణిగంజ్, బేగంపేట తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం కలిగింది. వరద నీరు రోడ్లపై ఎక్కడికక్కడే నిలిచిపోయింది. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి నగర వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

అధికారుల సహాయక చర్యలు

ఖైరతాబాద్- పంజాగుట్ట మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రహదారిపై భారీగా వర్షపు నీరు ప్రవహించి వాహనదారుల ఇబ్బందులు పడ్డారు. కొన్ని వాహనాలు ఆగిపోగా పోలీసులు తోస్తూ ముందుకు కదిలించి ట్రాఫిక్‌ ఇబ్బందులను తొలగించేందుకు ప్రయత్నించారు. ఎక్కడ మ్యాన్‌హోల్‌లు.. గుంతలు ఉన్నాయో తెలియక కొంతమంది పాదాచారులు సైతం భయం భయంగా రోడ్లపై నడకసాగించారు.

ద్విచక్రవాహన దారుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం జంక్షన్‌ వద్ద భారీగా వరద నీరు చేరి వాహనలు నిలిచిపోయాయి. జీహెచ్​ఎంసీ సిబ్బంది, పోలీసులు మ్యాన్‌హోల్‌లు తెరిచి నీటిని తొలగించేందుకు తీవ్రంగా శ్రమించారు. మూసరాంబాగ్‌ వంతెనపై మూసీ వరద నీరు చేరగా అంబర్‌పేట మార్గంలో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మెహదీపట్నం నానల్‌నగర్‌లోనూ జనం అవస్థలు ఎదుర్కొన్నారు.

ఆసిఫ్‌నగర్‌లో 14 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్‌లో 12 సెంటీమీటర్ల వర్షం పడింది. విజయనగర్‌కాలనీ, బంజారాహిల్స్‌, నాంపల్లిలో 10 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్‌, టోలీచౌకి, మెహదీపట్నం, శ్రీనగర్‌కాలనీ పరిధిలో 9 సెంటిమీటర్లకుపైగా వర్షం పడింది. నగరంలో మిగతా చోట్ల 6 నుంచి 4 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైందని వాతావరణ అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

భాగ్యనగరంలో వర్షం.. భారీగా ట్రాఫిక్​ జాం

ABOUT THE AUTHOR

...view details