అంతర్గత మార్కుల ఆధారంగా పదో తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు ప్రకటించనున్నారు. కరోనా కారణంగా పరీక్షలను రద్దు చేసి, మార్కుల మదింపునకు ఏర్పాటు చేసిన ఛాయరతన్ కమిటీ కసరత్తు తుదిదశకు చేరింది. పదో తరగతి విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరంలో రెండు ఫార్మెటివ్ పరీక్షలను నిర్వహించారు. ఒక్కో పరీక్షను 50 మార్కులకు నిర్వహించారు. ఇప్పటికే ఈ మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వీటి ఆధారంగా గ్రేడ్లు ఇవ్వనున్నారు.
మార్కుల మదింపు ఇలా..
ఫార్మెటివ్-1లో ఎక్కువ మార్కులు వచ్చిన 3 సబ్జెక్టులను తీసుకొని, వాటిని సరాసరి చేస్తారు. ఒక సబ్జెక్టు సరాసరి మార్కులు వస్తాయి. ఇలాగే ఫార్మెటివ్-2ను చేస్తారు. ఈ రెండింటిని కలిపి పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు 50మార్కులకు నిర్వహించిన ఫార్మెటివ్-1 సరాసరిన 45మార్కులు రాగా.. ఫార్మెటివ్-2లో 47 మార్కులు వస్తే ఈ రెండు కలిపి 92మార్కులుగా తీసుకుంటారు. దీని ఆధారంగా మొత్తం గ్రేడ్, సబ్జెక్టు గ్రేడ్ ఇస్తారు. అంతర్గత మార్కుల విధానం అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది.