అమ్మ ఒడి పథకానికి నిధులు సమీకరణ... జగనన్న అమ్మఒడి పథకం అమలు కోసం వివిధ శాఖల నుంచి నిధుల విడుదలకు అనుమతులిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కీలకమైన నవరత్నాల అమల్లో భాగంగా అమ్మ ఒడి పథకానికి నిధుల విషయంలో ఇబ్బందులు తలెత్తటం వలన వివిధ ప్రభుత్వ శాఖల నుంచి నిధుల సమీకరించేందుకు ఆదేశాలు వెలువడ్డాయి. బీసీ సంక్షేమ శాఖలోని బీసీ కార్పొరేషన్ నుంచి 3 వేల 432 కోట్లు, కాపు కార్పొరేషన్ నుంచి 568 కోట్ల విడుదలకు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్ పాలనా అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
మొత్తం 6 వేల కోట్లు
మైనారిటీ సంక్షేమ శాఖలోని ఏపీ క్రిస్టియన్ ఆర్థిక సహకార సంస్థ, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 442 కోట్లు విడుదలకు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఇలియాస్ రిజ్వీ ఆదేశాలిచ్చారు. గిరిజన సంక్షేమశాఖలోని ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 395 కోట్ల విడుదలకు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులిచ్చారు. సాంఘిక సంక్షేమశాఖలోని ఎస్సీ కార్పొరేషన్ నుంచి 1271 కోట్లు నిధుల విడుదలకు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా అమ్మఒడి పథకానికి వివిధ శాఖల ఖాతాల నుంచి 6 వేల 109 కోట్ల రూపాయల విడుదలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
9 నుంచి అమల్లోకి అమ్మ ఒడి
ఈబీసీల్లో 3 లక్షల 80 వేలు, బీసీల్లో 19 లక్షల 7 వేల 836 మంది లబ్ధిదారులకు అమ్మఒడి పథకం కింద బీసీ సంక్షేమశాఖ నిధులను వెచ్చించనుంది. కాపు వర్గానికి చెందిన 3 లక్షల 79 వేల 33 మంది లబ్ధిదారుల తల్లులకు ఆర్థిక సాయం అందించనున్నారు. 2 లక్షల 85 వేల 495 మంది ముస్లిం మైనారిటీ తల్లులు, 9 వేల 679 మంది క్రిస్టియన్ తల్లులకు పథకం వర్తింపచేసేందుకు మైనారిటీ సంక్షేమశాఖ నుంచి నిధులు వినియోగించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 9 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇదీ చదవండి :
అమ్మఒడి పథకం... నిధుల విడుదలకు అనుమతులు