అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి వైద్య విశ్వవిద్యాలయం, పరిశోధన, ఆవిష్కరణల హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు గ్లోబల్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ రవీంద్రనాథ్ కంచెర్ల తెలిపారు. ఇందుకోసం తన సంపాదనలో 70 శాతం (సుమారు రూ.350 కోట్లు) కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. గ్లోబల్ హెల్త్ ఫౌండేషన్‌కు ఆ మొత్తాన్ని బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రపంచ స్థాయి వైద్యవిద్య, పరిశోధనలు అందించనున్నట్లు వివరించారు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు దేశంలో వైద్యరంగం ఇంకా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అత్యుత్తమ ప్రమాణాలతో వైద్య విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పుతున్నట్లు తెలిపారు. నిపుణులైన వైద్యులను తయారు చేయడమే కాకుండా వైద్య రంగంలో వస్తున్న నూతన సాంకేతికత అంశాలపైనా ఇక్కడ పరిశోధనలు, ఆవిష్కరణలు ఉంటాయన్నారు. తన ప్రయత్నానికి ఎంతోమంది నిపుణులు వైద్యులు, ప్రముఖులు సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వస్తున్నట్లు చెప్పారు. 750-1000 పడకలతో అంతర్జాతీయ వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి 100 మిలియన్ల యూఎస్ డాలర్లు ఖర్చు అవుతుందని, దానికి ఏడు సంవత్సరాల వ్యవధి పడుతుందన్నారు. ఇప్పటికే గ్లోబల్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా 50 మిలియన్ల డాలర్లు సమకూర్చినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిపుణులను తయారు చేయడంతో పాటు తక్కువ ఖర్చుతో ఆధునిక సాంకేతికత అందించాలనేది ఈ వైద్య విశ్వవిద్యాలయం ప్రధాన ఉద్దేశమన్నారు.