ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

LOVE:ప్రేమను ఒప్పుకోలేదనే కోపంతో ప్రియురాలి ఇళ్లు కాల్చేసిన ప్రేమికుడు..! - lover attack on girl house

ప్రేమిస్తున్నానంటూ.. రెండేళ్లుగా యువతి వెంట పడుతున్నాడు. ప్రియురాలు మాత్రం అతడి ప్రేమకు పచ్చ జెండా ఊపట్లేదు. అంతలోనే.. అమ్మాయి ఇంట్లో వాళ్లు వేరొకరితో పెళ్లి నిశ్చయించారు. అసలే ప్రియురాలు తన ప్రేమ ఒప్పుకోవట్లేదనే బాధలో ఉన్న.. ప్రేమికుడికి ఈ వార్త... పుండు మీద కారం చల్లినట్టైంది. కట్​ చేస్తే.. కొన్ని రోజుల తర్వాత అమ్మాయి వాళ్ల ఇళ్లు కాలిపోయి ఉంది. అసలు ఈ మధ్యలో ఏం జరిగిందంటే..?

ప్రేమను ఒప్పుకోలేదనే కోపంతో ప్రియురాలి ఇళ్లు కాల్చేసిన ప్రేమికుడు..!
ప్రేమను ఒప్పుకోలేదనే కోపంతో ప్రియురాలి ఇళ్లు కాల్చేసిన ప్రేమికుడు..!

By

Published : Oct 26, 2021, 10:48 PM IST

ప్రేమ పేరుతో అమ్మాయిల వెంట పడుతుంటారు కొందరు అబ్బాయిలు. ఒప్పుకుంటే సరే. మరి ఒప్పుకోకపోతే మాత్రం కథ వేరే ఉంటది. ప్రేమిస్తావా..? లేదా..? అంటూ వేధింపులు ప్రారంభమవుతాయి. కొందరు ఇంకో అడుగు ముందుకేసి.. దాడులకు తెగబడుతుంటారు కూడా. ఇవన్నీ మనం తరచూ వినే వార్తలే. కానీ... ఇక్కడ ఓ ప్రేమికుడు మాత్రం నాలుగైదు అడుగులు ముందేకేసి.. ఏకంగా ఆ ప్రియురాలి ఇంటినే కాల్చేశాడు.

రెండేళ్లుగా వెంటపడుతున్నాడు..

తన ప్రేమను ఒప్పుకోలేదని అమ్మాయి ఇంటిని దగ్ధం చేశాడు ఓ ప్రేమికుడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తెలంగాణలోని మేడ్చల్​ జిల్లా​ జవహర్​నగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. జవహర్​నగర్​లోని బీజేఆర్ నగర్​కు చెందిన నవీన్(23) ఫుడ్​ డెలివరీ బాయ్​గా పనిచేస్తున్నాడు. స్థానికంగా నివసించే యువతిని ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని వెంటపడుతున్నాడు. కానీ.. ఆ యువతి మాత్రం ఒప్పుకోలేదు. ప్రియురాలు కనికరించకపోయినా.. ప్రేమ, పెళ్లి అంటూ ఆమె వెంటే రెండేళ్లుగా తిరుగుతున్నాడు. తన చేష్టలతో అమ్మాయిని వేధిస్తూనే ఉన్నాడు.

సినిమాలో హీరో రేంజ్​లో ధమ్కీ..

ఎన్ని రోజులైనా.. యువతి ఒప్పుకోవట్లేదనే బాధలో ఉన్న నవీన్​కు పిడుగులాంటి వార్త తెలిసింది. ఇటీవలే.. ఆ యువతి తల్లిదండ్రులు ఆమెకు మరో యువకుడితో వివాహం నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్న నవీన్.. తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తాను ఆమెను ప్రాణంగా ప్రేమిస్తున్నానని.. పెళ్లంటూ చేసుకుంటే తానే చేసుకుంటానని.. ఇంకెవరితోనైనా పెళ్లి చేస్తే బాగుండదంటూ.. యువతి బంధువులను బెదిరించాడు. అదే ఆవేశంలో.. ఒక వేళ వేరే వాళ్లతో పెళ్లి చేయాలని చూస్తే.. ఇంటిని తగలబెడతానంటూ హెచ్చరించాడు.

పోలీసులకు ఫిర్యాదు..

ఇదిలా ఉండగా.. ఈ నెల 10న అమ్మాయి వాళ్ల నానమ్మకు ఆరోగ్యం బాగాలేకపోవటం వల్ల కుటుంబసభ్యులంతా కలిసి ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లిపోయారు. కట్​ చేస్తే.. ఈ నెల 23న యువతి ఇల్లు కాలిపోయినట్లు స్థానికులు వారికి సమాచారం అందించారు. వెంటనే నగరానికి చేరుకున్న బాధితులు.. ఇంటిని చూసి అవాక్కయ్యారు. ఇల్లు మొత్తం కాలిపోయి.. సామాన్లన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇది నవీన్ చేసిన పనిగా యువతి కుటుంబసభ్యులు అనుమానించారు. ఈ ఘటనపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు నవీన్​ను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి:

వరదలో చిక్కుకున్న తల్లీబిడ్డల కోసం యువకుల సాహసం- సీఎం ఫిదా

ABOUT THE AUTHOR

...view details