Gayathri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారు మూడు గంటల నుంచి పంచ ముఖాలతో కూడిన వేద మాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అన్ని మంత్రాలకు గాయత్రిదేవి మూలశక్తి అయిన అమ్మ.. ముక్తా, విద్రుమ, హేమ, నీల, దవళ వర్ణాలతో ప్రకాశిస్తూ సంధ్యా వనదేవతగా పూజలు అందుకుంటున్నారు- గాయత్రిమాత. దశ హాస్తాలతో ఉన్న అమ్మవారిని దర్శించి గాయత్రీ మంత్రం పఠిస్తే మంత్రసిద్ధి ఫలం లభిస్తుందన్నది భక్తుల విశ్వాసం.
అమ్మవారిని దర్శనానికి:రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పూడి ముత్యాలనాయుడు, మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావుతోపాటు ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి మురళీధరరెడ్డి, ఇతర రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖులకు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు ఆలయ సిబ్బంది. అమ్మవారి దర్శనం- అనంతరం వేద ఆశీర్వచనం అందించారు. గాయత్రీ దేవి రూపంలో అమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రులు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరిపైనా అమ్మదీవెనలు ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.
పోలీసుల వైఖరిపై అర్చకుల ఆగ్రహం : దుర్గగుడి అర్చకులు, పండితులను ఆలయంలోకి అనుమతించే విషయంలో కొందరు పోలీసుల తీరు విమర్శలకు తావిచ్చింది. ఆలయ స్థానాచార్యులు, ప్రధాన అర్చకులతోసహా అమ్మవారి అలంకరణ చేసే ముఖ్యమైన పండితులను పోలీసులు అడ్డుకుని వారిపై దురుసుగా మాట్లాడారు. మూడు రోజులుగా పోలీసుల వైఖరి తమను ఆవేదనకు గురిచేసేలా ఉందని పండితులు అసంతృప్తి చెందారు. తమను అవమానిస్తే విధులకు హాజరుకాలేమని తెలిపారు. అమ్మవారి ఉత్సవాల్లో అలంకరణ, ఇతర వైదిక కార్యక్రమాలు, అమ్మవారి భోగాల నివేదన వంటి క్రతువులు సకాలంలో జరగాల్సిందేనని తెలిపారు. ఎక్కడ ఆలస్యమైనా దాని ప్రభావం రోజువారీ దర్శనాలపై పడుతుందని పండితులు పేర్కొన్నారు.