పాలనా వికేంద్రీకరణ- సీఆర్డీఏ రద్దు చట్టాల అమలుపై దాఖలైన పిటిషన్ లపై విచారణకు రాష్ట్ర హైకోర్టు సెప్టెంబర్ 21కి వాయిదా వేసింది. అప్పటి వరకూ ఈ అంశంలో యథాతథ స్థితి కొనసాగుతుందని తెలిపింది. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు వీలు కల్పిస్తూ.. ప్రభుత్వం చేసిన పాలనా వికేంద్రీకరణ- సీఆర్డీఏ రద్దు చట్టాలను జూలై 31న గవర్నర్ ఆమోదించారు. వీటిని వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆగస్టు 4న స్టేటస్ కో విధించింది. వీటిపై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం.. సెప్టెంబర్ 21వరకు స్టేటస్ కో ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది. కౌంటర్లు దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సెప్టెంబర్ 11వరకు గడువిచ్చింది. దీనిపై అభ్యంతరాలను సెప్టెంబర్ 17లోగా తెలిపేందుకు పిటిషనర్లకు అవకాశం ఇచ్చింది.
రోజువారీ విచారణ
మూడు రాజధానుల ఏర్పాటుపై దాఖలైన అన్ని పిటషన్లను కలిపి విచారించేందుకు ఇక రోజువారీ విచారణను ప్రత్యక్షంగా చేపడతామని హైకోర్టు తెలిపింది. దీనిపై అందరి అభిప్రాయాలు విన్న తర్వాత కోర్టులో భౌతిక దూరం పాటిస్తూ.. విచారణ చేపడతామని చెప్పింది. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని వారం రోజుల్లో చెబుతామని కోర్టు ప్రకటించింది.