రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా వ్యాప్తి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో రెవెన్యూ రాబడి సుమారు రూ.50 వేల కోట్ల మేర తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు సమాచారం. కిందటి ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడి రూ.1,61,958 కోట్ల మేర సాధించవచ్చని ఆర్థికశాఖ అధికారులు లెక్కలు వేశారు. సంబంధిత తుది లెక్కలు ఇంకా కాగ్ పరిశీలనలో ఉన్నాయి. అంతిమ గణాంకాలు వెలువడాల్సి ఉంది. అయితే రాష్ట్ర ఆర్థికశాఖ అధికారుల సమాచారం మేరకు రెవెన్యూ రాబడి సుమారు రూ.1,12,000 కోట్లకే పరిమితమైంది. అంటే దాదాపు రూ.50 వేల కోట్ల మేర ఆదాయం తగ్గినట్లు అంచనా.
ఒకవైపు కరోనా వ్యాప్తి కారణంగా జరిగిన ఆర్థిక నష్టం (రూ.20వేల కోట్లు)... మరోవైపు ఖర్చు ఎక్కువుగా ఉండటంతో ఎన్నడూ లేనంతగా రెవెన్యూ లోటు ఏర్పడుతుందని చెబుతున్నారు. రాష్ట్రంలో జీఎస్టీ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం, అమ్మకపు పన్ను, కేంద్ర పన్నుల్లో వాటాలు, ఎక్సైజ్ డ్యూటీ, ఇతర పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని అంతా కలిపి రాష్ట్ర సొంత ఆదాయంగా లెక్కిస్తారు. ఇవికాకుండా పన్నేతర ఆదాయమూ, కేంద్రం నుంచి గ్రాంటుగా మంజూరయ్యే నిధులు కలిసి ఆ ఏడాదికి రాష్ట్ర రెవెన్యూగా ఉంటుంది.