రాష్ట్ర బడ్జెట్‌పైనా కరోనా కాటు పడుతుందా అంటే అవుననే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. 2021-22 బడ్జెట్ అంచనాలు పెద్దగా పెరిగే ఆశలేవీ కనపడటం లేదు. ఈసారి పద్దు రూ.2.28 లక్షల కోట్ల నుంచి 2.38 లక్షల కోట్ల మధ్యే ఉండొచ్చని ప్రస్తుత అంచనా. ఏడాది కాలానికి పైగా కరోనా అతలాకుతలం చేస్తుండటంతో రాష్ట్ర ఆదాయం అంతంత మాత్రంగా మిగిలింది. ప్రతి ఏటా బడ్జెట్ అంచనాలు ఎంతో కొంత పెరగడం సహజం. రెండేళ్లుగా ఈ పరిస్థితులు కనిపించడం లేదు. 2020-21 బడ్జెట్ అంచనాలు కూడా అంతకు ముందు ఏడాదితో సమానంగానే ఉన్నాయి. ఇప్పుడు కూడా అంతకుమించి పెరిగే అవకాశాలు దాదాపు లేవని చెబుతున్నారు. పెరుగుదల ఏదైనా ఉన్నా అది రూ.పదివేల కోట్లకే పరిమితం కావచ్చని సమాచారం. ఇప్పటికే తొలి మూడు నెలల కాలానికి రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్‌ను ఆమోదించింది. రూ.70,983.11 కోట్ల అంచనాతో తొలి 3 నెలల ఖర్చుల ప్రతిపాదనలకు గవర్నర్ నుంచిఆర్డినెన్సు రూపంలో ఆమోదం పొందింది. వచ్చే గురువారం ఒక్కరోజు అసెంబ్లీ నిర్వహించి బడ్జెట్‌ను ఆమోదించుకునేందుకు ప్రభుత్వం సన్నద్ధమయింది. ఇప్పటికే బడ్జెట్ లెక్కలన్నీ ఖరారయ్యాయని సమాచారం.
రాబడి అంచనాలు తప్పాయి
కిందటి ఏడాది రాష్ట్రం అంచనా వేసిన దానిలో దాదాపు రూ.50 వేల కోట్ల మేర తరుగుదల కనిపిస్తోంది. కరోనా కారణంగా కిందటి ఏడాది తొలి మూడు నెలల్లో రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు సరిగా లేక రాబడులు తగ్గినా అంతకుముందు ఏడాది ఎంత ఆదాయం వచ్చిందో దాదాపు ఆ మేర రాబడులు దక్కాయి. మిగిలిన రూపాల్లో వచ్చే అంచనాలు తప్పడం వల్లే మొత్తం మీద రాష్ట్ర రాబడులు తగ్గిపోయాయి. కేంద్ర సాయం రూపంలో వస్తుందని లెక్కలు వేసుకున్న మొత్తంలో సగం కూడా అందకపోవడంతో అంచనాలు తలకిందులయ్యాయి. సొంత రాబడులు దాదాపు జీతాలు, పింఛన్లకే సరిపోవడంతో సంక్షేమ పథకాలన్నింటికీ రుణాల రూపంలోనే నిధులు సమకూర్చుకోవాల్సి వచ్చింది.