ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

meals bills pending: నాడు రోగుల కడుపు నింపారు.. నేడు బిల్లుల కోసం పడిగాపులు

contractors facing problems: ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరి రోగులతో పాటు కరోనా రోగులకు ఆహారం పెట్టిన గుత్తేదారులు.. నేడు కూడు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అందుకు ప్రధానం కారణం ప్రభుత్వం బిల్లులు చెల్లించపోవడమేనని వారు వాపోతున్నారు.

contractors-facing-problems-due-to-meals-bills-pending
నాడు రోగుల కడుపు నింపారు.. నేడు బిల్లల కోసం పడిగాపులు కాస్తున్నారు..!

By

Published : Dec 10, 2021, 9:23 AM IST

contractors facing problems due to pending bills: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో (కొవిడ్‌ సంరక్షణ కేంద్రాలు సహా) రోగులకు భోజనం సరఫరా చేసిన గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరికి సుమారు రూ. 40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకూ చెల్లించాల్సి ఉంటుందని అంచనా. ఈ సొమ్ము కోసం గుత్తేదారులు నిత్యం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖకు సంబంధించిన సుమారు రూ.2వేల కోట్ల మేర బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌లో నిలిచిపోయాయి. ఇందులో భోజనం బిల్లులూ ఉండటం గమనార్హం.

ఇదీ పరిస్థితి...

  • గత ఏడాది డిసెంబరు నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో కర్నూలు జిల్లా ఆదోనిలో గుత్తేదారు మంగళవారం బాలింతలకు భోజనం పెట్టలేదు.
  • విజయవాడలోని పాత, కొత్త ఆసుపత్రిలో కలిపి నాన్‌-కొవిడ్‌, కొవిడ్‌ రోగులకు అందించిన భోజనం కోసం రూ.7 కోట్లు చెల్లించేందుకు ట్రెజరీ నుంచి టోకెన్‌ వచ్చినా డబ్బు విడుదల చేయలేదు.
  • అనంతపురం జిల్లా హిందూపురం ఆసుపత్రిలో గుత్తేదారుడిని అధికారులు బతిమిలాడి వంట చేయించాల్సి వస్తోంది.
  • పలు జిల్లాల్లోని ఆసుపత్రుల్లో కొవిడ్‌ బాధితులకు పర్యాటకశాఖ భోజనాన్ని సరఫరా చేసింది. ఇందుకు సంబంధించి రూ.30 కోట్ల వరకు చెల్లించాల్సి ఉన్నా బకాయి పెట్టారు.

నాన్‌ కొవిడ్‌ ఆసుపత్రుల్లోనూ..

  • అనంతపురం జిల్లా కేంద్రంలోని సర్వజనాసుపత్రిలో నిత్యం 900 మంది రోగులు, పీజీ విద్యార్థులకు భోజనాలు పెడుతున్నారు. గత ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు చెల్లించాల్సిన రూ.1.25 కోట్లకు సంబంధించి రూపాయీ రాలేదని గుత్తేదారు వాపోతున్నారు. హిందూపురంలోని జిల్లా ఆసుపత్రిలో భోజనం అందిస్తున్న గుత్తేదారుకు రూ.20 లక్షల వరకు చెల్లించాలి. మడకశిర ప్రాంతీయ ఆసుపత్రిలో 22 నెలలుగా బిల్లులు ఇవ్వలేదు.
  • తూర్పుగోదావరి జిల్లాలోనూ గుత్తేదారులకు రెండేళ్ల నుంచి బిల్లులు సక్రమంగా చెల్లించడం లేదు. రాజోలులో రోగులకు భోజన సరఫరాను 4 రోజులపాటు నిలిపేయగా.. ప్రజాప్రతినిధి జోక్యంతో మళ్లీ అందిస్తున్నారు. అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రిలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ గతేడాది జూన్‌ నుంచి బిల్లులు ఇవ్వలేదు.
  • చిత్తూరు జిల్లా ఆస్పత్రిలో 2019 జూన్‌ నుంచి రూ.25 లక్షల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మదనపల్లె, శ్రీకాళహస్తి, పుంగనూరు, వాల్మీకిపురం, పలమనేరు, కుప్పం, పీలేరు, కలికిరి, నగరి, పుత్తూరు ఆసుపత్రులకు గత మార్చి నుంచి సుమారు రూ.75 లక్షల బకాయిలున్నాయి.
  • గుంటూరు జిల్లాలో వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలోని 5 ఆసుపత్రుల్లో రోగులకు భోజనం సరఫరా చేసిన గుత్తేదారులకు రూ.70 లక్షల వరకు చెల్లించాలి.
  • విశాఖపట్నం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు బోధనాసుపత్రులు, వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో నడిచే టెక్కలి, రాజాం, మచిలీపట్నం, అవనిగడ్డ, బాపట్ల తదితర ఆసుపత్రుల్లోనూ భోజన బకాయిలు చెల్లించలేదని తెలుస్తోంది.

ఇదీ చూడండి:

TTD: తితిదే పరిపాలనా భవనం వద్ద ఉద్రిక్తత.. ఎఫ్​ఎమ్​ఎస్ కార్మికుల అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details