Administrative Reforms Committee: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు మరింత అద్భుతమైన సేవలు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. పరిపాలన సంస్కరణలు సూచించేందుకు నలుగురు ఐఏఎస్ అధికారులతో అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. ఖాళీల భర్తీ, కొత్త పోస్టుల అవసరం, వివిధ శాఖల్లో ఒత్తిడి, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉద్యోగుల భాగస్వామ్యం, సాంకేతికత వినియోగంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిటీని సీఎం ఆదేశించారు.
Committee with IAS officers: రాష్ట్రంలో ఉద్యోగుల పనితీరు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు పరిశీలనకు కమిటీ పని చేస్తుందని తెలిపారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ, కమిషనర్ శేషాద్రి ఆధ్వర్యంలో సీఎం కార్యదర్శి స్మిత సబర్వాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్య.. ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల సర్దుబాటు..
employees adjustment: రాష్ట్రంలో పలు అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేసి, సూచనలు ఇవ్వనుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉమ్మడి జిల్లాల్లో ఉద్యోగుల సర్దుబాటు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఉద్యోగుల కేటాయింపు, పరిపాలనా సంస్కరణలపై ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 38 వేల 643 మంది ఉద్యోగులను జిల్లాలలో సర్దుబాటు చేయగా.. 101 మంది మినహా 38 వేల 542 మంది వారికి కేటాయించిన స్థానాల్లో చేరారని సీఎంకు అధికారులు వివరించారు. ఆయా జిల్లాల్లో ఏర్పడిన ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా నోటిఫికేషన్ జారీ చేయడానికి అవసరమైన చర్యలను సూచించాలని కమిటీని కేసీఆర్ ఆదేశించారు. జిల్లాల్లో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలు, పోలీసు భవనాల నిర్మాణం పూర్తవుతున్నందున. వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును ఇంకా మెరుగు పరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక అందించాలని కమిటీకి తెలిపారు.