లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. లాక్డౌన్ నిబంధనలు, కొవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించాలని సూచించారు. ఎవరికి వారు నియంత్రణ పాటించాలని పేర్కొన్నారు. సినిమా షూటింగులు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధర్వంలో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, ఎస్.ఎస్. రాజమౌళి, దిల్‌రాజు, త్రివిక్రమ్, ఎన్.శంకర్, రాధాకృష్ణ, సి.కల్యాణ్, సురేశ్‌బాబు, కొరటాల శివ, జెమిని కిరణ్, మెహర్ రమేశ్, ప్రవీణ్‌బాబు తదితరులు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్ పునరుద్ధరణ, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించారు. సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని, సినిమా థియేటర్లు తెరిచే అవకాశం ఇవ్వాలని సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.