రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా భూ రికార్డుల్లో తప్పులను సవరించేందుకు సమగ్ర రీసర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రెవెన్యూ రికార్డులన్నీ తప్పులతడకగా ఉండటంతో.. భూ రికార్డుల ప్రక్షాళనకు రీసర్వే చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 1.35 కోట్ల సర్వే నెంబర్లు సహా వివిధ రకాలైన భూముల కేటగిరీలను మళ్లీ సర్వే చేయించేందుకు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
ఈ సమీక్షకు ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, సీఎస్ నీలం సాహ్ని, రెవెన్యూ శాఖ అధికారులు, సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. భూ రికార్డులను సరి చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సీఎం అధికారులకు సూచించారు. కార్స్ టెక్నాలజీ (కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్సు స్టేషన్) సాయంతో రాష్ట్రంలో రీసర్వే చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టుగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రీసర్వే అనంతరం ప్రతీ భూమికి ఓ ప్రత్యేకమైన సంఖ్యను కేటాయించనున్నట్టు అధికారులు వెల్లడించారు.