ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆ జాబితా ఇవ్వండి: కేంద్రానికి  సీఎం లేఖ

By

Published : May 3, 2020, 9:25 AM IST

విదేశాల నుంచి స్వదేశాలకు వచ్చే వారి వివరాలు కేంద్రం.. రాష్ట్రాలకు అందిస్తే...వారి కోసం క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటుతో పాటు ముందస్తు చర్యలు తీసుకునే వెసులుబాటు కలుగుతోందని సీఎం జగన్ అన్నారు.

cm-jagan-letter-to-central-govt
కేంద్రానికి సీఎం లేఖ

విదేశాల్లో చిక్కుకుపోయిన తెలుగువారు భారత్‌కు తిరిగొచ్చేందుకు 6 వారాలుగా ఎదురు చూస్తున్నారని... వారికి తగిన సాయం అందించేలా ఏర్పాట్లు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని సీఎం జగన్‌ కోరారు. అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరిస్తే గల్ఫ్‌ దేశాల నుంచి భారత్‌కు తిరిగొచ్చే వారిలో ఆంధ్రపదేశ్‌కు చెందిన వారు వేల సంఖ్యలో ఉంటారన్నారు. భారత రాయబార కార్యాలయాల్లో స్వదేశాలకు రావాలనుకునే వారి వివరాల నమోదు సజావుగా జరిగేలా చూడాలని శనివారం విదేశాంగశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఆ వివరాలను రాష్ట్రాలకు అందిస్తే దేశానికి తిరిగొచ్చే వారి కోసం క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటుతో పాటు ముందుజాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశముంటుందని తెలిపారు.

కువైట్‌లో ఏప్రిల్‌ 30లోగా వివరాలు నమోదు చేసుకోవాలని గడువు విధించడంతో 29న రాయబార కార్యాలయానికి ప్రవాసులు భారీగా తరలివచ్చారని, ఈ సందర్భంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు జగన్ వివరించారు. ‘వీసా గడువు ముగిసినా తమ దేశంలో ఉంటున్న వలస కార్మికుల కోసం కువైట్‌ ప్రభుత్వం క్షమాభిక్ష విధానాన్ని తీసుకొచ్చింది. జరిమానాలు రద్దు చేయడంతో పాటు స్వదేశానికి వెళ్లేందుకు ప్రయాణ ఖర్చులు అందించాలని నిర్ణయించిన విషయం మీకు (కేంద్రమంత్రి) తెలిసిందే. కువైట్‌లో ఈ ఎగ్జిట్‌ క్లియరెన్స్‌ ప్రక్రియ జరుగుతోంది. కరోనా నియంత్రణకోసం ఇతర గల్ఫ్‌ దేశాలు కువైట్‌ తరహా విధానాన్ని అనుసరించి అక్కడున్న వలసదారులను స్వదేశాలకుపంపే అవకాశముంది. భారత్‌ అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభిస్తే కరోనా సంక్షోభంతో ఉద్యోగాలు కోల్పోయిన వారంతా స్వదేశానికి తిరిగొస్తారు. అలాంటి వారి సంఖ్య గణనీయంగా పెరగొచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాయబార కార్యాలయాల్లో నమోదుచేసిన ప్రవాసుల జాబితాను రాష్ట్రాలకు ముందుగానే అందిస్తే మరిన్ని ఏర్పాట్లతో సంసిద్ధమవుతాయి’అని సీఎం లేఖలో పేర్కొన్నారు.

ఇవీ చదవండి...కరోనా కాలంలో.. ఆమె సేవలు అసాధారణం

ABOUT THE AUTHOR

...view details