వైకాపాకు ప్రత్యేక సిద్ధాంతం ఉందని, తమ పార్టీ ఏ కూటమిలోనూ లేదని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. సచివాలయం మొదటి బ్లాక్ లో పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి జగన్(CM Jagan Meeting with YSRC MPs) సమావేశమయ్యారు. అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపైనే పోరాడాలని.. ముఖ్యమైన వాటికి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారని వెల్లడించారు. పోలవరంపై కేంద్రం వైఖరిని ప్రస్తావించాలని సీఎం జగన్ (cm jagan on polavaram project funds) కోరినట్లు పేర్కొన్నారు. పోలవరానికి రూ.55,548 కోట్ల అనుమతి వచ్చేలా చూడాలన్నారని వివరించారు.
'పోలవరంపై కేంద్రం వైఖరిని ప్రస్తావించాలని కోరారు. ఈ ప్రాజెక్టుకు అంశాలవారీ అనుమతులు సరికాదు. డిజైన్ల అనుమతి, నిధుల మంజూరుపై కేంద్రాన్ని నిలదీయాలని సీఎం చెప్పారు. సదరన్ జోనల్ కౌన్సిల్‌లో లేవనెత్తిన 6 అంశాలను ప్రస్తావించాలని సూచించారు. తెలంగాణ రూ.6,112 కోట్ల మేర విద్యుత్ బకాయిలు ఇవ్వాలి. కేంద్ర ఒత్తిడి మేరకే తెలంగాణాకు ఈ విద్యుత్ సరఫరా చేశాం. ఆ చెల్లింపులకు బాధ్యత కేంద్రానిదే. 2014 నుంచి రూ.22,940 కోట్ల రెవెన్యూ లోటు ఉంది. రెవెన్యూ లోటుపై కేంద్రం తీవ్రమైన అన్యాయం చేస్తోంది. ఈ విషయంపై పార్లమెంటులో లేవనెత్తాలని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు' - విజయసాయిరెడ్డి, వైకాపా ఎంపీ