అణగారిన వర్గాలవారికి సమాన అవకాశాల కోసం మహాత్మా జ్యోతిరావు పూలే సత్యశోధన సమాజాన్ని స్థాపించారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అంటరానితనం నిర్మూలన, సమానత్వం కోసం పూలే ఎంతో ఆరాటపడ్డారని కొనియాడారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం పూలే పోరాటం చేశారని అన్నారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసులు కాదు, బ్యాక్ బోన్ క్లాస్‌గా మార్చాలనేదే తన విధానమని సీఎం తెలిపారు. బీసీల సమగ్ర అభివృద్ధికి పాదయాత్రలో బీసీల డిక్లరేషన్ ప్రకటించినట్లు గుర్తు చేశారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా మేనిఫెస్టోను రూపొందించామన్నారు.
మంత్రివర్గంలో అందరికీ సముచిత స్థానం
మంత్రివర్గ కూర్పులో 60 శాతం మందిని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు స్థానం కల్పించామన్నారు. బీసీల సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు కేటాయింపులు చేశామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ కాంట్రాక్టులు ఇవ్వాలని చట్టం చేశామని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు.