ప్రజాప్రయోజనాలు పట్టని శాసనమండలిపై రూపాయి ఖర్చు చేసినా దండగేనని ముఖ్యమంత్రి జగన్ తీవ్రంగా విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న శాసనసభ ఆమోదించిన బిల్లులను రాజకీయ కారణాలతో తాత్కాలికంగా అడ్డుకునేందుకు మాత్రమే పనిచేస్తున్న మండలిని రద్దు చేస్తున్నామని...ఈ మాట చెప్పడం ఎంతో గర్వంగా ఉందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ప్రజాప్రయోజనాలు పట్టని మండలిని కొనసాగించడం, దానికోసం రాష్ట్ర ఖజనా నుంచి ఖర్చు చేయడం దండగని అన్నారు. ఆర్టికల్ 142 ప్రకారం ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం శాసనసభకే జవాబుదారీతనంగా ఉంటుంది కానీ....మండలికి కాదని స్పష్టం చేశారు. అలాంటప్పుడు శాసనసభ ఆమోదించిన బిల్లు మండలికి ఎందుకు వెళ్లాలనే ప్రశ్నకు సమాధానమే లేదన్నారు. ఈ మండలి వల్ల కాలయాపన, ప్రజాప్రయోజనాలకు విఘాతం తప్ప మంచి జరిగే అవకాశం కనిపించడం లేదన్నారు.
ఇక్కడే మేధావులు ఉన్నారు
మండలి కచ్చితంగా ఉండాలని రాజ్యాంగ రచన కమిటీ అనుకుని ఉంటే....దాన్ని రద్దు చేయడానికి వీళ్లేకుండా ఏర్పాటు చేసేదని ముఖ్యమంత్రి అన్నారు. అందుకే రెండోసభను శాసనసభ ఐచ్చికానికే వదిలేసిందని...ఆర్టికల్ 169 ప్రకారం రద్దు అధికారం అసెంబ్లీకే ఇచ్చేసిందన్నారు. దేశంలో విద్యావంతులు తక్కువగా ఉండి....మేధావులు, విజ్ఞులు అసెంబ్లీకి ఎన్నికయ్యే పరిస్థితులు లేనిరోజుల్లో ఎగువ సభలను ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం శాసనసభలో అలాంటి దుస్థితి లేదని....ముగ్గురు పీహెచ్డీలు, 38 పీజీలు, 13 మంది వైద్యులు, 14 మంది ఇంజినీర్లు సహా ఎంతోమంది విద్యావంతులు, సివిల్ సర్వీసెస్ అధికారులను ప్రజలు నేరుగా ఎన్నుకున్నారని వివరించారు.