'గెలుపు ఖాయం' - టెలీకాన్ఫరెన్స్
కాపు రిజర్వేషన్లపై మాట్లాడే అర్హత జగన్ కు లేదని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన కాపు రిజర్వేషన్లపై మోసగించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని తెలిపారు.
రైతులకు పెట్టుబడి సాయం చరిత్రాత్మక నిర్ణయమని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీనేతలతో అమరావతిలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రం ఎన్నో షరతులతో కిసాన్ సమ్మాన్ యోజన ప్రకటించిందని... దానికంటే మెరుగ్గా చేశామన్నారు. కౌలు రైతులకు సైతం మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.
పింఛన్ కింద ఏడాదికి 24వేలు, పసుపు కుంకుమ కింద ఒక్కో మహిళకు 20వేలు ,రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబానికి 10వేలు ఇస్తున్న మూడు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని క్యాడర్ కు సీఎం దిశా నిర్దేశం చేసారు. ఆర్థికలోటులో సైతం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జరిగింది ఆంధ్రప్రదేశ్‌లోనేనని ఉద్ఘాటించారు.
మోదీ పాలనపై దేశవ్యాప్తంగా తీవ్రవ్యతిరేకత ఉందని చంద్రబాబు అన్నారు. జాతీయ పార్టీనేతలతో చర్చలు ఫలప్రదంమయ్యాయన్న ఆయన ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకోవాల్సివుందని స్పష్టం చేశారు.
చీరాల లో పార్టీ బలంగా ఉందని...నాయకులు వస్తుంటారు పోతుంటారు పార్టీ ని అంటి పెట్టుకుని ఉండేది మాత్రం కార్యకర్తలేనని చంద్రబాబు పేర్కొన్నారు. తన పై కులముద్ర వేయాలని చూడటం దారుణమన్నారు. విద్యార్ధి దశనుంచి నన్ను గౌరవించింది బీసీ,ఎస్సీ,ఎస్టీ,ముస్లిం మైనారిటీ ఇతర కులాల వారేనని స్పష్టం చేశారు.
కాపులకు రిజర్వేషన్లని చెప్పి మోసగించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని... కాపు రిజర్వేషన్లపై ప్రతిపక్ష నేత జగన్ కు సంబంధం లేదని సీఎం మండిపడ్డారు. మోదీ, జగన్ ,కేసీఆర్ లు కలిసి కుట్రరాజకీయాలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు.