వైకాపా సభ్యులు తనపై లేనిపోని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. అసెంబ్లీ గేటు వద్ద తమను దారుణంగా అవమానించారని... తాను అనకుండానే బాస్టర్డ్ అన్నట్లు ఆరోపిస్తున్నారని స్పష్టం చేశారు. ఇలాంటి వైఖరి సీఎం స్థాయి వ్యక్తికి తగదని హితవు పలికారు. ప్రతిపక్ష నేతను అడ్డుకునే అధికారం చీఫ్ మార్షల్‌కు ఉందా? అని ప్రశ్నించారు. సభలోకి వెళ్లకుండా అడ్డుకోవడం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగిని తాము ఎప్పుడూ తిట్టలేదని ఉద్ఘాటించారు. మీ పనులు ఉన్మాదిలా ఉన్నాయని అన్నానని... దానిలో తప్పేమీ లేదని సమర్థించుకున్నారు. ప్రతిపక్ష నేతను దెబ్బతీయడమే వైకాపా నేతల లక్ష్యమని చంద్రబాబు దుయ్యబట్టారు.
సమాధానం చెప్పలేక...
శాసనసభ పవిత్రతను చెడగొడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వైకాపా సభ్యుడు తనపై తిట్ల దండకం అందుకుంటున్నారని వెల్లడించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో వైకాపా ప్రభుత్వం చేసిన పనులు అందరికీ తెలుసని... ఈ 6 నెలల్లో ఎవరికి చెల్లింపులు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మంచి పనులు చేస్తారనే ప్రజలు వైకాపాకు ఓటు వేశారని... తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక... నోటితో చెప్పలేని వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని అన్నారు.