Union Ministry of Water Energy Meeting on Polavaram: కేంద్ర జలశక్తి శాఖ ప్రధాన సలహాదారు వెదిరె శ్రీరాం అధ్యక్షతన పోలవరం సమస్యల పరిష్కారంపై దిల్లీలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట గోదావరి గర్భంలో ఇసుక కోత, పెద్ద పెద్ద గోతులను పూడ్చేందుకు నిపుణులు మూడు ప్రత్యామ్నాయాలు ముందుంచారు. నీటిని తోడేయడం, ఆ తర్వాత ఇసుకను నింపడం మొదటిది కాగా.. డ్రెడ్జింగ్ విధానంలో ఇసుక నింపడం రెండోది. కొంత డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక నింపుతూ, వైబ్రో కాంపాక్షన్‌తో ఇసుక గట్టిదనాన్ని పెంచి ఆ తర్వాత సాధారణ స్థాయికి తీసుకురావడం మూడోది. ఇందులో మూడో ప్రత్యామ్నాయానికి నిపుణులు మొగ్గు చూపారు. దీనిపై పలు పరీక్షలు చేసి, జులై 15కి ఫలితాలు వచ్చాక కేంద్ర జలసంఘానికి, డ్యాం రివ్యూ ప్యానల్ సభ్యులకు పంపాలని నిర్ణయించారు.
ఆ తర్వాత దీనికి సంబంధించి ఆగస్టు 15లోగా డిజెన్ల ప్రతిపాదనలు, ఎలా ముందుకెళ్లాలో సమగ్రంగా నివేదికలు తయారు చేయాలని నిర్ణయించారు. వాటిని కేంద్ర జలసంఘానికి, డీడీఆర్పీ(DDRP)కి పంపి వాటి ఆమోదం పొందిన తర్వాత అక్టోబర్ నుంచి ప్రారంభించాలని తీర్మానించారు. జులై ప్రారంభంలోగా వరదలు వచ్చే సమయానికి దిగువ కాఫర్ డ్యాం నిర్మాణ పనులు పూర్తిచేయాలని నిశ్చయించారు. ప్రధాన డ్యాం రెండో భాగంలో ఇసుక కోత పడ్డ ప్రాంతంలో ఇసుక నింపడం, వైబ్రో కాంపాక్షన్‌తో ఇసుకను మెరుగుపరుస్తూ అక్కడి పరిస్థితులను చక్కదిద్దాలని నిర్ణయించారు. ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాంల వద్ద ఎంత సీఫేజ్ ఉంటుందో పరీక్షించాలని తీర్మానించారు.