అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ఆధ్వర్యంలో తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రను పోలీసులు అఢ్డుకున్నారు. బుధవారం సాయంత్రమే బస్సులను సీజ్ చేసి విజయవాడ ఆటోనగర్ ప్రాంతంలోని ఏపీఐఐసీ కార్యాలయం వద్దకు తరలించారు. దీనిని నిరసిస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు బెజవాడ బెంజిసర్కిల్ నుంచి బస్సులు ఉన్న ప్రదేశం వరకూ కాలినడకన వెళ్లాలని నిర్ణయించారు. చంద్రబాబు వెంట నేతలంతా పాదయాత్రగా వెళ్లి.. బస్సుయాత్ర ప్రారంభించాలని నిర్ణయించటంతో పోలీసులు నిరాకరించారు. చంద్రబాబు సహా ఇతర తెలుగుదేశం ముఖ్యనాయకులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఐకాస నేతలను బెంజిసర్కిల్ వద్దే అడ్డుకున్నారు.
ధ్వజమెత్తిన చంద్రబాబు
శాంతియుతంగా వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవటంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అన్ని అనుమతులు తీసుకున్న తమను..ఆపటం సరికాదన్నారు. పోలీసుల తీరుపై ధ్వజమెత్తారు. అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.చంద్రబాబు రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతున్న విషయం..వ్యాపించటంతో బెంజిసర్కిల్ ప్రాంతానికి... పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. చంద్రబాబు, ఐకాస నేతలు చేపట్టిన నిరసనకు బాసటగా ఆందోళనలు చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
బెంబేలెత్తిన బెజవాడ
దాదాపు నాలుగున్నర గంటల పాటు బెంజిసర్కిల్ ప్రాంతం..బెజవాడను బెంబేలెత్తించింది. పరిస్థితి చేయి దాటుతుండటంతో పోలీసులు.. చంద్రబాబుతోపాటు ఇతర నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఫలితంగా వాతావరణం మరింత వేడెక్కి ఘర్షణ పరిస్థితులకు దారితీసింది.నేతలందరినీ ఒకే బస్సులో ఎక్కించిన పోలీసులు... వారిని తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే వేలాదిగా ప్రజలు తరలిరావటంతో ప్రాంగణం కిక్కిరిసింది. నేతలు ప్రయాణిస్తున్న బస్సుకు అడ్డం పడుతూ కదలకుండా ఉండే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నిరసనకారులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. కొందరిని ఇష్టం వచ్చినట్లు ఈడ్చిపడేశారు. మరికొందరిని ఎత్తి వ్యానుల్లోకి విసిరేశారు. ఈక్రమంలో అనేకమందికి గాయాలయ్యాయి.